బంగ్లాదేశ్ ఢాకా విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం

బంగ్లాదేశ్ ఢాకా విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం

బంగ్లాదేశ్: ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌లో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. మంటలు అదుపులోకి రావడంతో విమానాల రాకపోకలు శనివారం సాయంత్రం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌లో భారీ అగ్నిప్రమాదం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. 

ఈ కారణంగా విమానాల రాకపోకలను నిలిపివేయవలసి వచ్చింది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు పౌర విమానయాన, పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. అగ్నిప్రమాదానికి కారణాలను గుర్తిస్తామని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

విమానాశ్రయంలోని కార్గో విభాగంలో మధ్యాహ్నం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 37 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. బంగ్లాదేశ్ సైన్యం, నేవీ, వైమానిక దళం అగ్నిమాపక సేవలతో కలిసి మంటలను అదుపు చేశాయి. విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. 

విమానాశ్రయం మూసివేత కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో రెండింటిపై రాకపోకలపై ప్రభావం పడింది. అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ నుండి ఢాకాకు వెళ్లే ఇండిగో సర్వీసును కోల్‌కతాకు మళ్లించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానాన్ని ఢాకాకు ఆగ్నేయంగా దాదాపు 250 కి.మీ దూరంలో ఉన్న చిట్టగాంగ్‌కు పంపారు. ముందు జాగ్రత్త చర్యగా విమాన కార్యకలాపాలను నిలిపివేశారు.