జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల ఎమ్మెల్యే ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కావడం లేదని, భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జగిత్యాలలో బీజేపీ నాయకురాలు భోగ శ్రావణితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ వైపు బీజేపీలో చేరుతానని చెబుతూ, మరోవైపు తన కోవర్టులతో బీజేపీ నాయకురాలు శ్రావణి ఇంటిపై దాడులు చేయించడం ఏమిటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెండు నవోదయ స్కూల్స్‌తో పాటు జగిత్యాలకు కేంద్రియ విద్యాలయం మంజూరైనప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల భూమి కేటాయింపులో జాప్యం జరుగుతోందని విమర్శించారు.
డిసెంబర్ 24న 5 ఎకరాలు కేటాయించామని ఎమ్మెల్యే చెప్పినా ఇప్పటికీ ప్రక్రియ పూర్తి కాలేదని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవడం లేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. నిబంధనల ప్రకారం కనీసం 8 నుంచి 10 ఎకరాల భూమి అవసరమని, అందరికీ అనుకూలంగా ఉండే చల్‌గల్ వద్ద భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
