కంగ్టి/మెదక్/ఎల్కతుర్తి, వెలుగు: కరెంట్ షాక్ తో ముగ్గురు రైతులు వేర్వేరు చోట్ల మరణించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(బి) గ్రామానికి చెందిన బాలాజీ పాటిల్(50) ఉదయం తన పొలంలో పండిస్తున్న మక్క పంటకు నీరు పారిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి స్పాట్లో మృతిచెందాడు.
మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తిమ్మాయపల్లి(బి) గ్రామానికి చెందిన ఎర్ర బిక్షపతి(42) ట్రాన్స్ఫార్మర్ వద్ద రిపేర్ చేస్తుండగా షాక్ తగిలి స్పాట్లో మృతిచెందాడు. మృతుడికి భార్య నాగమణి, కొడుకు ఉన్నారు. హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మండలం కన్నూరు గ్రామానికి చెందిన సుధాటి కొండల్ రావు(58) ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు.
బావిలో పడి వృద్ధురాలు..
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన గూడూరు రాజేశ్వరి(71) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. గురువారం మధ్యాహ్నం బహిర్భూమి కోసం బయటకు వెళ్తుండగా కాలుజారి వ్యవసాయ బావిలో పడినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.
