ఇరాన్ వైశాల్యం అమెరికాలో ఆరో వంతు.. కానీ 92 మిలియన్ల జనాభాతో పశ్చిమాసియాలో కీలకం

ఇరాన్ వైశాల్యం అమెరికాలో ఆరో వంతు.. కానీ 92 మిలియన్ల జనాభాతో పశ్చిమాసియాలో కీలకం

న్యూఢిల్లీ: అమెరికా– ఇజ్రాయెల్ తో దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్ వైశాల్యం పరంగా ప్రపంచంలోని పెద్దదేశాల్లో ఒకటి. అమెరికా పరిమాణంలో ఆరో వంతు మాత్రమే ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలో 17వ పెద్ద దేశం. అమెరికా, ఇరాన్ మ్యాప్​లను ఒకదానిపై ఒకటి పెట్టి పోలిస్తే వాటి భూభాగ విస్తీర్ణాలు స్పష్టమవుతాయి. 

పశ్చిమ ఆసియాలో చిన్నచిన్న దేశాలు చాలా ఉన్నాయి.. అయితే ఇరాన్ మాత్రం భారీ భూభాగాన్ని కలిగి ఉంది. ఇరాన్ మొత్తం విస్తీర్ణం సుమారు 16.5 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది అమెరికాలో అతిపెద్ద రాష్ట్రం అలాస్కాతో సమానం. టెక్సస్ రాష్ట్రం కంటే ఇరాన్ 2.5 రెట్లు పెద్దది. టెక్సస్, కాలిఫోర్నియా, మాంటానా వంటి అనేక రాష్ట్రాలను కలిపినా ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం కావు. 

ఇరాన్​ను పూర్తిగా నియంత్రించడం కష్టమే!

ఇరాన్‌‌‌‌లో ప్రస్తుతం సుమారు 92 మిలియన్ల జనాభా ఉంది. రాజధాని టెహ్రాన్‌‌‌‌లోనే 9.6 మిలియన్లు నివసిస్తున్నారు. ఇరాక్, టర్కీ, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఈ పెద్ద భూభాగం, పశ్చిమాసియాలో ఉన్న స్థానం వల్ల ఇరాన్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన దేశం. 

భూభాగంపరంగా, జనాభా పరంగా పెద్ద దేశమైనందున యుద్ధం జరిగితే దాన్ని పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. అలాగే ప్రపంచ రవాణాలో కీలకమైన హార్మోజ్ సముద్రమార్గం ఆ దేశానికి ఆనుకొనే ఉంది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గం నుంచే అత్యధికంగా ట్రాన్స్​పోర్టు జరుగుతుంది.