ఆర్థికంగా ఏ లోటు లేని మాజీ భార్యకు.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

ఆర్థికంగా ఏ లోటు లేని మాజీ భార్యకు.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఆర్థికంగా ఏ లోటు లేకుండా.. చెప్పుకోతగిన సంపాదన కలిగిన మాజీ భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉన్న జీవిత భాగస్వామి విడాకులు కోరితే ఆమెకు జీవన భృతి మంజూరు చేయబడని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో గ్రూప్ 'ఎ' అధికారిగా పనిచేస్తున్న ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన సందర్భంలో ఢిల్లీ హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో గ్రూప్ 'ఎ' అధికారిగా పనిచేస్తున్న ఒక మహిళ.. ఆమె విడాకుల తర్వాత న్యాయవాది అయిన తన భర్త నుంచి శాశ్వత భరణం, పరిహారం కోరింది. 2010లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఒక సంవత్సరం మాత్రమే కలిసి జీవించారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులకు అప్లై చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆగస్టు 2023లో ఫ్యామిలీ కోర్టు ఈ భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసింది. 

►ALSO READ | ధన్‌తేరాస్‌లో భారీ కొనుగోళ్లు: వ్యాపారం లక్ష కోట్లు దాటుతుందని CAIT అంచనా..

హిందూ వివాహ చట్టం (HMA)లోని సెక్షన్ 25, పార్టీల ఆదాయం, సంపాదన సామర్థ్యం, ఆస్తి.. ప్రవర్తన, అలాగే ఇతర సంబంధిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శాశ్వత భరణం, భరణం ఇవ్వడానికి కోర్టులకు విచక్షణాధికారం కల్పిస్తుందని డివిజన్ బెంచ్ నొక్కి చెప్పింది. అయితే, ఈ నిబంధన ఉద్దేశం ఏంటంటే.. విడాకులు తీసుకున్న భార్య జీవనాధారం కోల్పోయిన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా చూసుకోవడం అని న్యాయమూర్తులు అనిల్ క్షేత్రర్‌పాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది. అలా అని.. విడాకులు తీసుకున్న ప్రతీసారి ప్రతీ ఒక్కరికీ ఈ భరణం లేదా పరిహారం వర్తించదని.. నిజంగా ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉన్న సందర్భంలో మాత్రమే పరిహారం పొందే అవకాశం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.