ధన్‌తేరాస్‌లో భారీ కొనుగోళ్లు: వ్యాపారం లక్ష కోట్లు దాటుతుందని CAIT అంచనా..

ధన్‌తేరాస్‌లో భారీ కొనుగోళ్లు: వ్యాపారం లక్ష కోట్లు దాటుతుందని CAIT అంచనా..

ఈసారి ధన్‌తేరస్ పండుగ సందర్భంగా భారతదేశం అంతటా వ్యాపారం మొత్తం లక్ష కోట్లు దాటుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఇందులో కేవలం బంగారం, వెండి అమ్మకాలు మాత్రమే దేశవ్యాప్తంగా రూ. 60 వేల  కోట్లకు పైగా ఉంటాయని CAIT తెలిపింది. మన దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుందని, కానీ ధన్‌తేరస్‌కు ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉందని CAIT  పేర్కొంది.

ధన్‌తేరస్  రోజున దేశవ్యాప్తంగా ప్రజలు సంప్రదాయం ప్రకారం బంగారం, వెండి, కొత్త పాత్రలు, వంట సామాగ్రి, వాహనాలు, చీపుర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లక్ష్మీదేవి-గణేశుడి విగ్రహాలు, మట్టి దీపాలు ఇతర పూజ సామాగ్రి కొంటుంటారు. వీటన్నిటినీ సంపదకు, శ్రేయస్సుకు చిహ్నాలుగా భావిస్తారు.
 
ధన్‌తేరస్ రోజు రాగి, వెండి లేదా ఉక్కుతో చేసిన కొత్త పాత్రలు కొనడం శుభప్రదమని, ఇది స్వచ్ఛతను, సంపదను సూచిస్తుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్  తెలిపారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రోజు చీపురు కొంటే పేదరికం, చెడు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ  కాలంలో ప్రజలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. వీటిని కూడా అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తున్నారు.

బంగారం, వెండి వ్యాపారం : CAIT  ఆభరణాల విభాగం (AIJGF) జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా ప్రకారం, గత రెండు రోజులుగా ఆభరణాల మార్కెట్లలో ఊహించని రద్దీ కనిపించింది. మా అంచనాల ప్రకారం, కేవలం బంగారం, వెండి అమ్మకాల బిజినెస్ రూ. 60 వేల  కోట్లను దాటింది. ఢిల్లీ మార్కెట్లలోనే రూ. 10వేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి, గత ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. 

ALSO READ : ఎప్పుడైనా బంగారం స్వీట్లు తిన్నారా..

గతేడాది 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 80వేలు  ఉండగా, ఈ ఏడాది అది రూ. 1 లక్ష 30వేలకి దాటింది, అంటే దాదాపు 60 శాతం పెరిగింది. అలాగే, వెండి ధరలు కూడా 2024లో కిలోకు రూ. 98 వేలు నుండి ప్రస్తుతం  రూ. 1 లక్ష 80 వేలకి పెరిగింది అంటే దాదాపు 55 శాతం పెరుగుదల. ధరలు పెరిగిన కూడా బంగారం, వెండి కొంటునే ఉన్నారని CAIT తెలిపింది. ఎందుకంటే వీటిని అత్యంత సురక్షితమైన పెట్టుబడులుగా భావిస్తారు. అయితే, ఈసారి సాధారణ ప్రజలు తేలికైన అంటే లైట్ వెయిట్ ఆభరణాలు కొనేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు.

వస్తువుల అమ్మకాల అంచనా:
* పాత్రలు & కిచెన్‌వేర్ (వంట సామాగ్రి): రూ. 15 వేల కోట్లు
*ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్ వస్తువులు: రూ. 10 వేల కోట్లు
*అలంకరణ వస్తువులు, దీపాలు & పూజ సామాగ్రి: రూ. 3వేల కోట్లు
*డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, పండ్లు, బట్టలు, వాహనాలు & ఇతర వస్తువులు: రూ. 12 వేల కోట్లు

ఈ ఏడాది పండగ వ్యాపారం భారీగా  పెరగడానికి జీఎస్టీ (GST) రేట్ల తగ్గింపు ఇంకా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "Swadeshi Aapnao" (భారతీయ వస్తువులనే వాడండి) ప్రచారం  కారణమని CAIT పేర్కొంది. ప్రజలు స్థానికంగా తయారైన భారతీయ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వల్ల దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, చేతివృత్తులవారు, తయారీదారులు చాల ప్రయోజనం పొందుతున్నారు.