అందరి దృష్టి ‘అలంపూర్, గద్వాల’ పైనే

అందరి దృష్టి ‘అలంపూర్, గద్వాల’ పైనే

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో మిశ్రమ ఫలితాలు వెలువడటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా గద్వాల, అలంపూర్ మున్సిపాలిటీలపై అందరి దృష్టి పడింది. మున్సిపల్ చైర్మన్ స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అన్న ఉత్కంఠత నెలకొన్నది. జిల్లాలో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. అయిజ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 13 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్, ఏడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇక్కడ స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ కు ఉండడంతో గెలిచిన కౌన్సిలర్లతో క్యాంప్ కు  వెళ్లిపోయారు. 

వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 కౌన్సిలర్ స్థానాలు ఉండగా ఆల్  ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 8 కౌన్సిల్ స్థానాలను గెలుచుకున్నారు. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నది. ఏడు మంది కౌన్సిలర్ అభ్యర్థులతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లిపోయారు. 

గద్వాలలో మారుతున్న సమీకరణాలు!

గద్వాలలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కత్తులు దూసుకున్న బీఆర్ఎస్, బీజేపీ తాజాగా జతకట్టి క్యాంప్ రాజకీయాలకు తెర లేపాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మున్సిపల్ చైర్​పర్సన్ పీఠం కోసం మూడు పార్టీలకు చెందిన లీడర్లు తంటాలు పడుతున్నారు. గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 స్థానాలు ఉండగా, కాంగ్రెస్​ 16 దక్కించుకుంది. 

బీఆర్ఎస్ 11 స్థానాలు, బీజేపీకి 7 స్థానాలు దక్కాయి. మొత్తం 18 స్థానాలు ఉండడంతో ముగ్గురు ఎమ్మెల్సీ ఎక్స్ ఆఫీషియో ఓట్లతో గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని చేసుకునేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హైదరాబాద్​ ఉప్పల్ లోని ఓ రిసార్ట్​లో క్యాంప్ నిర్వహిస్తున్నారు. కాగా, 16 స్థానాలు కలిగిన కాంగ్రెస్​కు ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో పాటు ఎంఐఎం అభ్యర్థి ఒకరు ఉన్నారు. 

అదేవిధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్స్ ఆఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్​కు మొత్తం 20 ఓట్లు అవుతాయి. ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్సీ ఓట్లతో కలిపి మొత్తం 21 ఓట్లు అవుతున్నాయి. దీంతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఓట్ ను కూడా గద్వాలలో వినియోగించేలా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. ఈ సందిగ్ధం పరిస్థితిలో ఎవరు అధ్యక్ష పీఠం దక్కించుకుంటారోననే ఉత్కంఠత నెలకొన్నది.

అలంపూర్ లో ఫిఫ్టీ..ఫిఫ్టీ..

అలంపూర్ మున్సిపాలిటీలో 10 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 5, బీఆర్ఎస్ పార్టీకి ఐదు స్థానాలు వచ్చాయి. ఇక్కడ ఎక్స్ ఆఫీషియో  ఓటు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ ఆఫీషియో నమోదు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ మల్లు రవి చేసుకుని అవకాశాలు ఉండడంతో మళ్లీ రెండు పార్టీలకు సగం సగం సీట్లు కానున్నాయి. 

దీనికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ మరో ఎమ్మెల్సీ చేత కూడా ఎక్స్ ఆఫీషియో ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డికి మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందనే చర్చ జరుగుతున్నది.

అయిజ మున్సిపల్ చైర్​ పర్సన్​గా  సీఎం సురేశ్

అయిజ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా అందులో 13 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన సీఎం సురేశ్ మున్సిపల్ చైర్​ పర్సన్​గా ఎన్నిక కావడం లాంచనంగా మిగిలినది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెందిన వారు మున్సిపల్ చైర్​పర్సన్ గా ఎన్నికకానున్నారు. కాగా  అన్ని పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు వారిని క్యాంపులకు తరలించాయి.