
ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై ఇండియన్స్ కు ఉన్నంత మోజు మరే దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. మనోళ్లు ధరించినంత జ్యువెలరీ ఏ దేశంలో కూడా ధరించరేమో. అంత డిమాండు ఉన్న గోల్డు.. ఇప్పుడు ఆభరణాలకే కాదు.. తినటానికి కూడా పనికొస్తుంది అంటున్నారు స్వీట్ షాప్ ఓనర్లు. బంగారం ఏంటి.. తినటం ఏంటి అంటారా..? దీపావళి సందర్భంగా తయారు చేసిన బంగారం స్వీట్ల గురించి తెలుసుకుంటే ఇది నిజమే అని ఒప్పుకోక తప్పదు.
దివాళి సందర్భంగా రాజస్థాన్ జైపూర్ లో ఒక స్వీట్ షాప్ బంగారం స్వీట్లు తయారు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. స్వర్ణ ప్రసాదం పేరున తయారు చేసిన స్వీట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్వీట్లుగా చెబుతున్న వీటి ధర గురించి తెలిస్తే అవాక్కవ్వటం మీ వంతు. అవును ఈ స్వీట్ల ధర రూ.1,11,000. అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. ఇంత కాస్ట్లీ స్వీట్లు తినేదెవరు అనుకోకండి. అలాంటి బ్యాచ్ కూడా ఉంది. అందుకే అంతరేటు.
అయినా గోల్డును ఎలా తింటారనే కదా ప్రశ్న. ఈ స్వీట్లలో తినదగిన 24 క్యారెట్ల బంగారాన్ని కలిపి తయారు చేస్తారట. దీన్ని స్వర్ణ భస్మం లేదా గోల్డ్ యాషెస్ అంటున్నారు.
ఇండియాలో ఈ స్వీటు అత్యంత ఖరీదైనదని స్వీట్ షాప్ ఓనర్ అంజలీ జైన్ తెలిపారు. దీని ప్యాకేజింగ్, అప్పీరెన్స్ చాలా ప్రీమియంగా ఉంటుందని ఆమె చెప్పారు. ఈ బంగారం మిఠాయిలను జ్యువెలరీ బాక్స్ లో ప్యాక్ చేస్తున్నట్లు తెలిపారు. చిల్గోజా అనే అత్యంత ఖరీదైన డ్రైఫ్రూట్స్ తో ఈ స్వీట్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
ఎందుకింత ధర:
ఈ స్వీట్లలో లక్జరీ ఇంగ్రీడియెంట్స్ ఉపయోగిస్తున్నట్లు అంజలీ జైన్ తెలిపారు. అందుకే అల్ట్రా ప్రీమియం స్వీట్లుగా పాపులర్ అయ్యాయని అన్నారు. జైన దేవాలయం నుంచి కొన్న బంగారంతో ఈ స్వీట్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. భారత ఆయుర్వేదంలో వినియోగించిన స్వర్ణ భస్మం అనే గోల్డ్ వినియోగించి ఈ స్వీట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ స్వీట్లలో స్వర్ణ భస్మం అనే 24 క్యారెట్ల గోల్డును కలిపి తయారు చేస్తున్నాం. అలాగే స్వీట్ పైన జైన టెంపుల్ నుంచి తెచ్చిన బంగారం గోల్డ్ వర్క్ అప్లై చేస్తున్నాం. కుంకుమ పువ్వు, పైన్ నట్స్ తో చేసే హై ఎండ్ స్వీట్లు ఇవి... అని ఆమె తెలిపారు.
ఈ షాపులో వివిధ రేంజ్ లకు తగ్గట్లుగా బంగారం స్వీట్లు తయారు చేస్తున్నారు. పిస్తా లోంజ్ కేజీ ధర రూ.7 వేలు, కాజు కట్లి రూ.3500, లడ్లు రూ.2500, రసమలై మొదలైన ప్రీమియం స్వీట్లను అమ్ముతున్నారు. పండగ సీజన్లలో ధనవంతులు మాత్రమే కొనే స్వర్ణ ప్రసాదం ఈ షాపు స్పెషాలిటీగా చెప్పారు.