బృందావన్ ఫార్మా కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్

బృందావన్ ఫార్మా కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్

చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ బ్లాక్‌‌లో సాల్వెంట్ ప్రెషర్ పెరగడంతో రియాక్టర్ పేలింది. 

ఆ సమయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ ముక్కలు తగలడంతో పగడాల సాయి, దుర్గాప్రసాద్, అరుణ్ కుమార్, కోమలేష్ పాండేలకు స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం 24 రియాక్టర్లలో రెండు రియాక్టర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. 

పేలుడు శబ్ధం, పొగతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శనివారం పోలీసులు, యాజమాన్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని, నష్టం అంచనా ఇంకా వేయలేదని 
యాజమాన్యం తెలిపింది.