ఒకేసారి 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి: పాక్ తో సిరీస్ రద్దు..

ఒకేసారి 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి:  పాక్ తో సిరీస్ రద్దు..

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) కీలక ప్రకటన చేసింది. ఆఫ్ఘనిస్తాన్  దేశంలోని ఉర్గున్ జిల్లాలో జరిగిన సరిహద్దు దాడుల్లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు మరణించడంతో పాకిస్తాన్‌తో జరగబోయే ట్రై-సిరీస్ (tri-series) నుండి తప్పుకుంటున్నట్లు తెలిపింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏర్పాటు చేసిన ఈ మూడు దేశాల సిరీస్‌లో పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు నవంబర్ 17 నుండి 29 మధ్య రావల్పిండి, లాహోర్‌లలో జరగాల్సి ఉంది.

అయితే, ACB  సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసింది. పాక్టికా ప్రావిన్స్‌లోని షరానా రాజధానిలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ముగ్గురు క్రికెటర్లు చనిపోయారని తెలిపింది.

పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన దాడిలో పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన క్రికెటర్లు చనిపోయినందుకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ బాధాకరమైన సంఘటనకు నిరసనగా అలాగే చనిపోయినవారికి గౌరవ సూచకంగా నవంబర్ చివర్లో పాకిస్తాన్‌తో జరగబోయే మూడు దేశాల T20I సిరీస్ నుండి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుకోవాలని నిర్ణయించింది అని  ACB ట్వీట్ చేసింది. 

దాడి పై స్పందించని PCB: ఈ దాడి పై PCB ఇంకా స్పందించలేదు. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకతో జరగబోయే ఈ ట్రై-సిరీస్ 2025లో పాకిస్తాన్,  ఆఫ్ఘనిస్తాన్ ఆడే రెండవ ట్రై-సిరీస్. అలాగే పాకిస్తాన్ గడ్డపై ఆఫ్ఘనిస్తాన్ కి మొదటిది సిరీస్ అయ్యేది.

ఈ మూడు దేశాల సిరీస్‌లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండుసార్లు తలపడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ నవంబర్ 17న, రెండవది నవంబర్ 23న జరగాల్సి ఉంది. కానీ ఈ దాడి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ టీం  సిరీస్ నుంచి తప్పుకోవడంతో, టోర్నమెంట్ గందరగోళంలో పడింది.