గువాహటి: అస్సాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ ఫైటర్ జెట్ అదృశ్యమైంది. గురువారం అస్సాంలోని జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన యుద్ధవిమానం రాత్రి 7.42 గంటలకు రాడార్ నుంచి కనిపించకుండాపోయిందని వాయుసేన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఆ యుద్ధ విమానాన్ని లొకేట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది.
సుఖోయ్ జాడను కనిపెట్టేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ ప్రారంభించామని వెల్లడించింది. మరోవైపు అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు. అయితే, ఈ పేలుడుకు, సుఖోయ్ మిస్సింగ్ కు సంబంధం ఉందా? లేదా? అన్నది వెల్లడికాలేదు. కాగా, రష్యాకు చెందిన సుఖోయ్ ఫైటర్ జెట్ లకు భారీ మార్పులు చేసి వాయుసేన వినియోగిస్తోంది.
