
చలికాలంలో కొందరు బయట బాల్కనీ, బిల్డింగ్ పైన లేదా పార్కుల్లో కూర్చుని ఎండను ఆస్వాదించడం ఎప్పుడైనా చూశారా...? ఇలా కేవలం హాయిగా ఉండటానికి మాత్రమే కాదు. మీ చర్మంపై ఆ వెచ్చని సూర్యరశ్మి పడటం వల్ల మీ శరీరం హాయిగా అనిపించడం కంటే ఎంతో మేలు చేస్తుంది. ఈ సూర్యరశ్మి మీ ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైన విటమిన్ డి ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
మన దేశం ఎండ ఎక్కువగా ఉండే దేశం అయిన కూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక విటమిన్ డి లోపం ఉన్న దేశాలలో ఒకటి. చాల వయసుల భారతీయుల్లో 70–100% మందికి సరిపడా విటమిన్ డి స్థాయిలు ఉండకపోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చలికాలంలో విటమిన్ డి ఎందుకు అంత ముఖ్యమో, మీ శరీరంలో వీటి స్థాయిలను సురక్షితంగా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.....
విటమిన్ డి ఎందుకు అవసరం: మన చర్మానికి ఎండ తగిలినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం దీనిని సూర్యరశ్మి విటమిన్ అని పిలుస్తాము. విటమిన్ డి మన శరీరం కాల్షియం & Phosphorus గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది లేకపోతే, ఎముకలు బలహీనపడతాయి. పిల్లలలో రికెట్స్, పెద్దలలో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి తక్కువగా ఉంటే కండరాలు బలహీనపడతాయి, ముఖ్యంగా వయసు పైబడిన వారిలో..
విటమిన్ డి మన శరీర వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది, జబ్బులతో పోరాడటానికి సహాయపడుతుంది. సరిపడా విటమిన్ డి ఉంటే ఎక్కువగా వచ్చే జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విటమిన్ డి లోపం ఉంటే గుండె జబ్బులు, షుగర్, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డి పెంచుకోవడానికి : విటమిన్ డి కోసం మధ్యాహ్నం, అంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య మంచి సమయం. ఈ సమయంలోనే సూర్యుని నుండి వచ్చే UVB కిరణాలు బలంగా ఉంటాయని భారతదేశంలోని అధ్యయనాలు చెబుతున్నాయి. చేతులు, ముఖం, మోచేతుల కింది భాగం అలాగే కాళ్ళను రోజుకు 15–30 నిమిషాలు ఎండకు ఉంచడం మంచిది. మీరు గంటల తరబడి కూర్చోవాల్సిన అవసరం లేదు, రోజూ కొద్దిసేపు ఎండ తగలడం బాగా పనిచేస్తుంది.
నలుపు రంగు చర్మం ఉన్నవారికి, తెల్లని చర్మం ఉన్నవారి కంటే విటమిన్ డి ఉత్పత్తి కావడానికి ఎక్కువసేపు ఎండ అవసరం. వయసు పైబడిన వారు కూడా సహజంగా తక్కువ విటమిన్ డి ఉత్పత్తి చేస్తారు. వారికి ఆహారం లేదా మందుల ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అవసరం కావచ్చు. గుడ్లు, మకెరెల్ వంటి చేపలు, పుట్టగొడుగులు, విటమిన్ డి కలిపిన పాల ఉత్పత్తులను తీసుకోండి. ఇవి ఎండకు పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా, విటమిన్ డి స్థాయిలకు సపోర్ట్ చేస్తాయి.
మీకు విటమిన్ డి లోపం ఉందని డాక్టర్ చెప్తే మందులను వాడమని చెప్పొచ్చు. కానీ మందుల ద్వారా ఎక్కువ విటమిన్ డి తీసుకోవడం హానికరం కావచ్చు. ఎక్కువసేపు ఎండ తగలకుండా ఉంటే చర్మానికి హాని కలుగుతుంది. సూర్యరశ్మి తర్వాత, శరీరాన్ని కప్పి ఉంచండి లేదా సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
మన దేశంలో చలికాలంలో ఎండకు కూర్చోవడం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, చాలామందిలో ఉన్న విటమిన్ డి లోపాన్ని సరిచేయడానికి ఇదొక సులభమైన, సహజమైన మార్గాలలో ఒకటి. జలుబు, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే సమయంలో ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.