అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీ, కూతురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీ, కూతురు మృతి

తమ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు.. బాగా బతుకుతున్నారు. ఇటీవలే కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. మనవడి పుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వదించి వద్దామని.. అమెరికా వెళ్లిన దంపతులలో భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లితో పాటు అమెరికాలో సెటిల్ అయిన కూతురు కూడా చనిపోయింది. మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లీ కూతుళ్లు రమాదేవి, తేజస్విని శనివారం (అక్టోబర్ 18) జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల రెడ్డి కాలనీకి చెందినవిఘ్నేష్--రమాదేవి దంపతులకు స్రవంతి, తేజస్విని అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికీ వివాహం జరగటంతో అమెరికాలోనే సెటిల్ అయ్యారు.  అయితే పెద్ద కూతురు స్రవంతి ఇటీవలే చికాగోలో ఇల్లు నిర్మించుకుంది. అదే విధంగా మనవడి పుట్టిన రోజు కూడా ఉండటంతో వెళ్లి ఆశీర్వదించి వద్దామని భార్యభర్తలు విఘ్నేష్-రమాదేవి వెళ్లారు. 

పెద్ద కూతురు స్రవంతి ఇంటికి చిన్నకూతురు తేజస్విని, ఆమె భర్త కిరణ్ కుమార్ తో పాటు ఇద్దరు పిల్లలతోతో కలిసి వెళ్తున్న క్రమంలో కారును ట్రక్కు ఢీకొట్టింది. చికాగో సమీపంలో కారును వెనక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విని తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేర్పించినా లాభం లేకుండా పోయింది. తల్లీ రమాదేవి, కూతురు తేజస్విని మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బంధువులు దుఖసంద్రంలో మునిగిపోయారు. కిరణ్ కుమార్, ఇద్దరు పిల్లలు గాయాలతో బయటపడ్డారు.