
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో వచ్చిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ .. ఈ రెండు వారాల్లోనే రూ. 725 కోట్లకుపై వసూళ్లు రాబట్టింది. ఇదే దూకుడుతో వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'కాంతార 'మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు 'కాంతార: చాప్టర్ 1' ఆ రికార్డులను బద్దలు కొట్టి పాన్ ఇండియాలో టాప్ మూవీగా నిలిచింది.
తండ్రి సలహాతో ..
అయితే నిజ జీవితంలో పేరు మార్చుకున్న కథ, సినిమాలో గిరిజన తెగల కథ... రెండింటికీ ఆధ్యాత్మిక నమ్మకాల బలం ఉందని దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి నిరూపిస్తున్నారు. తన బ్లాక్‌బస్టర్ సినిమా 'కాంతార' తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అసలు పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాన్ని వెల్లడించారు. తన అసలు పేరు ప్రశాంత్ అని తెలిపారు. రిషబ్ పేరు మార్పు వెనుక తన తండ్రి సలహా ఉందని చెప్పారు.
అదృష్టం కోసం పేరు మార్పు..
సినిమారంగంలో మెరుగైన అదృష్టం, విజయం చేకూరడం కోసం నా పేరును రిషబ్ గా మార్చుకోమని మా నాన్న సూచించారు అని రిషబ్ వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రిషబ్ తండ్రి ఒక జ్యోతిష్యులు. అందుకే, సినిమా కెరీర్ కోసం పేరు మార్చాలని ఆయన సలహా ఇచ్చారు. ప్రశాంత్, రిషబ్ అనే రెండు పేర్లను కూడా తన తండ్రే ఎంపిక చేశారని రిషబ్ తెలిపారు.
►ALSO READ | Rashmika: విజయ్‌తో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ.. చాలా జరుగుతున్నాయంటూ హింట్!
కర్ణాటకలోని తీరప్రాంతంలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన రిషబ్ శెట్టి... సినీ పరిశ్రమలోకి రాకముందు నీళ్ల క్యాన్లు అమ్మడం, డ్రైవర్ గా, ఆఫీస్ బాయ్ గా, క్లాప్ బాయ్‌గా పని చేయడం లాంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తన పేరును మార్చుకున్న తర్వాతే కెరీర్‌లో అనూహ్యమైన మలుపులు వచ్చాయని ఆయన నమ్మకంగా చెబుతారు. ఈ నమ్మకమే, ఆయన సినిమాలలో కూడా సంప్రదాయాలు, దైవశక్తులు, ఆధ్యాత్మికతను బలంగా చూపించడానికి మూల కారణమైందని చెప్పుకొచ్చారు.
కథాంశం..
హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా, గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.
ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. 'కాంతార' ఫ్రాంచైజీ కేవలం వినోదం మాత్రమే కాక, మన సజీవ వారసత్వం, విశ్వాసం యొక్క ప్రతీకగా నిలిచిందని అభినందిస్తున్నారు....