
- మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచన
న్యూఢిల్లీ: యూపీ సర్కారు, శ్రీ బాంకే బిహారీ టెంపుల్ ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణుడే మొదటి రాయబారి అని పేర్కొంది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించింది. ఇందుకోసం ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొంది. శ్రీ బాంకే బిహారీ టెంపుల్ నిధుల నుంచి రూ.500 కోట్లతో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని యూపీ సర్కారు ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆలయ నిధులను ఉపయోగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ మే 15న ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని మౌఖికంగా ప్రతిపాదించింది.ఈ విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి ధర్మాసనం ప్రస్తావించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదించడంలో తొందర ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీని రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. మాజీ హైకోర్టు జడ్జి లేదా సీనియర్ రిటైర్డ్ జడ్జిని నిర్వహణ ట్రస్టీగా నియమిస్తామని, ఆలయాన్ని కమిటీ నిర్వహిస్తుందని తెలిపింది. అయితే, ఆలయ ఆచారాలను మునుపటిలాగే బాధ్యత అప్పగించిన కుటుంబం కొనసాగిస్తుందని తెలిపింది.