
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో వచ్చే నెల11నుంచి15 వరకు వేంకటేశ్వర వైభవోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వైభవోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం వర్చువల్‌గా సమీక్ష జరిపారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను లక్షలాది భక్తులు చూసే అవకాశం శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలతో లభిస్తుందని వీరబ్రహ్మం చెప్పారు. దీని గురించి హైదరాబాద్ లో ఇప్పటినుంచే విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్టేడియంలో టీటీడీ పంచగవ్య ఉత్పత్తుల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వేదికతోపాటు స్టేడియంలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, ఫ్లెక్సీల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.