కార్తీక మాసం 2025: విష్ణుమూర్తి మేల్కొనే రోజు... నవంబర్ 1 ఉత్థాన ఏకాదశి.. ఆరోజు విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

కార్తీక మాసం 2025: విష్ణుమూర్తి  మేల్కొనే రోజు... నవంబర్ 1 ఉత్థాన ఏకాదశి.. ఆరోజు విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

హిందువులకు కార్తీకమాసం ఎంతో ముఖ్యమైనది. ఈ నెల​అంతా ముఖ్యమైన  రోజులైనా.... ఏకాదశి.. సోమవారాలు.. పౌర్ణమి రోజులు విశేషంగా చెబుతారు పండితులు. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని  ఉత్థాన ఏకాదశి.. .. ప్రబోధిని ఏకాదశి  అంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం (నవంబర్​ 1) ఈ ఏడాది అనగా విశ్వావశునామ సంవత్సరంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  

కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిథి రోజున (నవంబర్​ 1) ఉపవాసం చేయడం శుభప్రదమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఆ  రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి.   ఆ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు.. వంద రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. 

శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలు మొదలవుతాయి,   కార్తీక శుద్ద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును మేల్కొలిపేందుకు విష్ణులోకానికి.. బ్రహ్మాది దేవతలతో పాటు.. మునులు.. మహర్షులు వెళతారు.  భజనలు చేసుకుంటూ.. నాట్యం చేస్తూ.. మృదంగం  వాయిద్యాలతో.. కీర్తనలు పాడుతూ స్వామిని మేల్కొలుపుతారు.  ఆ తరువాత  పరమేశ్వరుడు ... విష్ణుమూర్తిని అర్చించి.. హారతి ఇవ్వగా.. బ్రహ్మ వేదాలు పఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అప్పటి నుంచే పూజా కార్యక్రమాల్లో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి.  

ఉత్థాన ఏకాదశి రోజున ( నవంబర్​ 1) ఉపవాసం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు.  మర్నాడు అంటే ద్వాదశి రోజున దేవాలయాల్లో  తులసి వివాహాన్ని జరిపిస్తారు.  ఉత్థాన ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధన, ధాన్యాలకు లోటుండదని, సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటుండదని పండితులు చెబుతున్నారు.  

కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు మూర్తిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.  మహాభారత యుద్దంలో భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజునే ( కార్తీక శుద్ద ఏకాదశి ) రోజునే  అస్త్రాలను వదిలి అంపశయ్యపై శయనించాడు.  ఆ పవిత్రమైన రోజున( నవంబర్​ 1)   బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని, విష్ణువును స్మరించుకుంటూ శ్రీ హరి విగ్రహంలేదా ఫొటో ముందు శంఖం, గంటలు ఊపుతూ విష్ణువు ఎదుట ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. ద్వాదశి రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసం విరమించాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.