మెదక్ ​జిల్లా నిజాంపేటలో విషాదం

మెదక్ ​జిల్లా నిజాంపేటలో విషాదం

మెదక్ (నిజాంపేట), వెలుగు: ఫేస్ బుక్  ఫ్రెండ్​షిప్​ ప్రేమగా మారి అది విఫలం కావడంతో మెదక్ ​జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. నిజాంపేట ఏఎస్సై ప్రతాప్ కథనం ప్రకారం..గ్రామానికి  చెందిన బక్కోళ్ల మహేశ్ (21) డిగ్రీ పూర్తి చేశాడు. మూడేండ్ల కింద ఫేస్​బుక్​లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం చాటింగ్ ​చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమెను ప్రేమించాడు. పెండ్లి చేసుకోవాలని ​నిశ్చయించుకున్నాడు.

ఈ విషయాన్ని ఆ అమ్మాయికి  చెప్పగా అంగీకరించలేదు. దీంతో తన ప్రేమ విఫలమైందని మనస్థాపం చెంది ఈ నెల 2న పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు సిద్దిపేటకు, అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ​హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుని తల్లి యాదవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రతాప్ తెలిపారు.