- ఏడాది కింద ప్రేమపెండ్లి చేసుకున్న యువతీయువకులు
- జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో దారుణం
కోరుట్ల, వెలుగు: కట్నం విషయంలో గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన యువకుడు కత్తితో నాలుగు నెలల గర్భిణి అయిన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ గ్రామానికి గంధం ప్రసాద్ రాణి దంపతుల కుమార్తె వైష్ణవి(19), కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తరి సాయిలు- లక్ష్మి దంపతుల కుమారుడు హరిబాబు ప్రేమించుకొని ఏడాది కింద పెండ్లి చేసుకున్నారు.
వైష్ణవి ప్రస్తుతం గర్భిణి కావడంతో మాదాపూర్‌లోని తల్లిగారింట్లో ఉంటోంది. హరిబాబు కూడా భార్యతో పాటు అక్కడే ఉండేవాడు. పెండ్లి సమయంలో ఇచ్చే కట్నం, ఇతర లాంఛనాల విషయంలో కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి వైష్ణవి-, హరిబాబు మధ్య గొడవ జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన హరిబాబు కత్తితో వైష్ణవిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మంగళవారం ఉదయం ఐదు గంటల సమయంలో హరిబాబు బయటకు వచ్చి గదికి గడియ పెట్టి బైక్‌పై పరారయ్యాడు. ఉదయం నిద్రలేచిన వైష్ణవి తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూసే సరికే ఆమె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ సురేశ్ బాబు, ఎస్సై చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వైష్ణవి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాములు తెలిపారు.
నిందితుడు హరిబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. అతడిని అరెస్ట్ చేసే వరకు పోస్ట్‌మార్టం జరగనివ్వబోమంటూ పట్టుపట్టారు. డీఎస్పీ రాములు హాస్పిటల్ వద్దకు చేరుకొని నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పరారీలో ఉన్న హరిబాబును పట్టుకునేందుకు మూడు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే మేడిపల్లి వద్ద హరిబాబును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
