
మల్కాజిగిరి, వెలుగు: ప్రేమించి..పెళ్లిచేసుకుంటానని చెప్పి ఓ యువతి మోసం చేసిన యువకుడిని మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ మన్మోహన్ యాదవ్ కథనం ప్రకారం..మౌలాలి, హనుమాన్ నగర్ లో ఉండే వల్లెపు నవీన్ అలియాస్ అంజి(26) అనే యువకుడు లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అదే ప్రాంతంలోని ఆర్టీసీ కాలనీలో ఉండే శివనాగరి శ్రీలత(18), అంజి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీలతను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అంజి ఆరు నెలలుగా ఆమెకు రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈలోగా అంజి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుసుకున్న శ్రీలత..అంజి సెల్ఫోన్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన శ్రీలత ఈ నెల 26న మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అంజిని అరెస్టు చేశారు. అంజిని రిమాండ్ కి తరలించినట్టు సీఐ మన్మోహన్ యాదవ్ తెలిపారు.