చినుకు రాలదు..మొలక లేవదు..! మబ్బులు పడుతున్నా వాన కురుస్తలే..

చినుకు రాలదు..మొలక లేవదు..! మబ్బులు పడుతున్నా వాన కురుస్తలే..
  • భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్తున్నా కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వానలు
  • తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
  • ఈ నెలలో వర్షాభావ పరిస్థితులే ఉండొచ్చన్న అంచనాలతో ఆందోళన 
  • వానలు సరిగా లేక వెనకబడిన పంటల సాగు
  • నిరుడు ఈ టైమ్​లో కంటే 6.5 లక్షల ఎకరాలకుపైగా తక్కువ 

హైదరాబాద్, వెలుగు: ఆకాశంలో ఎక్కడ చూసినా మబ్బులు మంచిగనే కనిపిస్తున్నయ్. కానీ, వానలు అందరినీ నిరాశపరుస్తున్నయ్. మొగులుపట్టినా.. జల్లు మాత్రం జార్తలేదు. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ వార్నింగ్స్​ ఇస్తున్నా.. అవన్నీ ఉత్తవే అయిపోతున్నయ్. భారీ వర్షాలన్న దగ్గర అడపా దడపా కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వర్షమొస్తదని.. విత్తనం విత్తుదామని మొగులువైపు ఆశగా చూస్తున్న రైతన్న తీవ్ర నిరాశలోకి పోతున్నడు. ఈపాటికే విత్తుదశ దాటి మొలకలు రావాల్సిన కాలం ఎన్కబడుతుండడంతో ఆందోళన తప్పడం లేదు.

మహబూబ్​నగర్, ఆదిలాబాద్​లాంటి జిల్లాల్లో ముందస్తు పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు బిందెలు, ట్యాంకర్లతో నీటి తడులు అందిస్తున్నారు. దానికితోడు జులైలోనూ వర్షాభావ పరిస్థితులే ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇటు ప్రభుత్వం, అటు రైతుల్లోనూ తీవ్ర కలవరం మొదలైంది. 

అటు అరేబియా, ఇటు బంగాళాఖాతంలో సరైన వెదర్​ సిస్టమ్స్​ ఏర్పడకపోవడం వల్లే వర్షాలు పడడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జులైలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అంచనాల్లో వెల్లడించింది. సగటు వర్షపాతం 94 శాతం లోపే ఉంటుందని అంచనాలిచ్చింది. ఈ నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది.   

ఇవీ కారణాలు..

మామూలుగా నైరుతి రుతుపవనాలు తొలుత అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ కనుమలను తాకి మధ్య భారత ప్రాంతంలోకి చేరుకుంటాయి. అక్కడి నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి మళ్లీ ఈశాన్య, వాయువ్య ప్రాంతాలకు విస్తరిస్తుంటాయి. అలా విస్తరించే క్రమంలో కొన్ని వెదర్​ సిస్టమ్స్​ రుతుపవనాలకు తగినట్టుగా పాజిటివ్​గా ఉండాలని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం ఆ వ్యవస్థలన్నీ బలహీనంగా ఉండడం.. మేఘాలు ఏర్పడుతున్నా , తేమ వస్తున్నా,  మేఘాలకు ఎగువన ఉన్న గాలి తేమ గాలులను పైకి రాకుండా కిందకే నెడుతున్నాయని, అందువల్లే వర్షాల జాడ కనిపించడం లేదని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. 

మొన్నటిదాకా బంగాళాఖాతంలోనూ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయంటున్నారు నిపుణులు. కాగా, రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనంతో పరిస్థితులు మారొచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ఆ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని, దాని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో అది మరింత బలపడేందుకు అవకాశం ఉందంటున్నారు. దీని వల్ల రాష్ట్రంలో రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేశారు. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో,  ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. సీజన్​మొదలై నెల దాటినా 

పావు వంతు పంటలేయలే..

రాష్ట్రంలో వానాకాలం సీజన్​ షురూ అయ్యి  నెల దాటినా పావు వంతు పంటల సాగు కూడా నమోదు కాలేదు. నిరుడు కంటే దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. వానలు లేటయితే ఈ యేడు పునాస పంటలకు కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. పత్తి సాగు లక్ష్యంలో సగం చేరుకోగా.. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. వానకాలంలో సాధారణ సాగు 1.32 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు కేవలం 33.27 లక్షల ఎకరాల్లోనే  వివిధ పంటలు సాగయ్యాయి. అంటే, సాగు లక్ష్యంలో ఇది కేవలం 25 శాతమే  కావడం గమనార్హం. 

వాస్తవానికి గత ఏడాది ఇదే సమయానికి 39.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే, సాధారణ సాగు కంటేనూ ఆరున్నర లక్షల ఎకరాలు తక్కువగానే సాగు జరిగినట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పత్తి 26.83లక్షల ఎకరాల్లో సాగైంది. ఇది ఈ నెలలో సాధారణ సాగు కంటే 2 లక్షల ఎకరాలు తక్కువ. 

అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లాల్లో జులై మొదటివారానికి 4.14 లక్షల ఎకరాల్లో  పత్తి సాగవ్వాల్సి ఉండగా.. కేవలం 3.63 లక్షల ఎకరాల్లో నే వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడ్తోంది. ఇక ఈ సీజన్​లో రాష్ట్ర వ్యాప్తంగా  1.10 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. నిరుడుతో పోలిస్తే 70 వేల ఎకరాలు తక్కువగా వరినాట్లు పడ్డాయి. ముందస్తు వరినాట్లు వేసే నిజామాబాద్​ జిల్లాల్లో నిరుడు ఈ టైమ్​కు 1.38 లక్షల ఎకరాల్లో సాగైతే ఈయేడు కేవలం 34 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇలాగైతే ఈ సీజన్​లో సాధారణ వరిసాగు 62.47 లక్షల ఎకరాలు చేరుకోవడం కష్టమేనని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. 

11 జిల్లాల్లో 10 శాతం లోపే పంటల సాగు

ఈ సీజన్​లో సాధారణంగా ముందుస్తు పంటలు సాగయ్యే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డిలో మాత్రమే పంటల సాగు 50 శాతం మించింది. 11 జిల్లాల్లో కనీసం 10 శాతం కూడా పంటలు నమోదు కాలేదు. కామారెడ్డిలో 2 శాతం, కరీంనగర్​లో 9, పెద్దపల్లి జిల్లాలో 6, జగిత్యాల జిల్లాలో 5, సిరిసిల్ల జిల్లాలో 9.91, ములుగు జిల్లాలో 9.16, జనగామ జిల్లాలో7.84, మేడ్చల్​ జిల్లాలో 8.9, వనపర్తి జిల్లాలో 2.85, సూర్యాపేట జిల్లాలో 5.79 శాతం మాత్రమే వానాకాలం పంటలు వేయడం గమనార్హం.

మిగతా పంటల పరిస్థితీ అంతంతే

ఈ వానాకాలం సీజన్​లో  మక్కజొన్న ఇప్పటికే రెండున్నర లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా.. నేటీకీ లక్ష ఎకరాల్లోనే సాగైంది. ఈ సీజన్ లో​5.73 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేయాలని టార్గెట్ గా​పెట్టుకోగా ఇప్పటి వరకు పావువంతు అయినా సాగవలేదని వ్యవసాయశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కందులు నిరుడు ఈ టైంకు 2.39 లక్షల ఎకరాల్లో వేయగా.. ఈ యేడు కేవలం 1.43 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 

అంటే, నిరుడు కంటే 96 వేల ఎకరాలు తక్కువగా సాగైంది. సోయా సాగు సైతం పెద్దగా నమోదు కాలేదు. సోయా సాధారణ సాగు 4.20 లక్షల ఎకరాలు కాగా 1.64 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. వేరుశనగ వెయ్యి ఎకరాల మార్కు దాటక పోగా మిగతా నూనె గింజల పంటలేవి కనిపించిన దాఖలాలు లేవు. జొన్నల సాగు కేవలం 8 వేల ఎకరాలు నమోదు కాగా పెసలు 20 వేలు, మినుములు 5వేల ఎకరాల్లో సాగయ్యాయి.