చర్చ లేకుండనే 19 బిల్లులు పాస్

చర్చ లేకుండనే 19 బిల్లులు పాస్
  • ఆఖరి రోజునా పార్లమెంట్ ఉభయసభల్లో నిరసనలు 
  • ఆన్​లైన్ గేమింగ్, కొత్త ఐటీ చట్టం బిల్లులు ఆమోదం 
  • ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు
  • ఉభయసభలు నిరవధిక వాయిదా 

న్యూఢిల్లీ: అన్ని రకాల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ను నిషేధిస్తూ కేంద్రం తెచ్చిన ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ బిల్లుకు పార్లమెంట్‌‌‌‌ ఆమోదం లభించింది. ఈ బిల్లు బుధవారం లోక్‌‌‌‌సభలో పాస్‌‌‌‌కాగా, గురువారం మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టంగా మారనుంది. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను చట్టంతో సహా మొత్తం 19 బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసన, ఆందోళనలతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులన్నీ పాస్‌‌‌‌ అయ్యాయి. తీవ్ర నేరారోపణలతో 30 రోజులు జైల్లో ఉన్న పీఎంలు, సీఎంలు, మంత్రులను గద్దె దించేలా కేంద్రం ప్రతిపాదించిన మూడు కీలక బిల్లులతో పాటు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లునూ పార్లమెంట్‌‌‌‌ ఆమోదించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నిరసనలతోనే ముగింపు

జులై 21న మొదలైన పార్లమెంట్‌‌‌‌ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సమావేశాల్లో లోక్‌‌‌‌సభలో కేంద్రం 14 బిల్లులు ప్రవేశపెట్టగా 12 బిల్లులకు ఆమోదం లభించింది. రాజ్యసభలో 15 బిల్లులు పాస్‌‌‌‌ అయ్యాయి. మణిపూర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రెండు బిల్లులు, జీఎస్టీ సవరణ బిల్లు, అప్రోప్రియేషన్‌‌‌‌ బిల్లు, ఐఐఎమ్‌‌‌‌ల పనితీరుకు సంబంధించిన మరో బిల్లును కూడా ప్రతిపక్షాల నిరసనల నడుమ రాజ్య సభ ఆమోదించింది. అయితే, తొలి భారతీయ ఆస్ట్రొనాట్‌‌‌‌ శుభాంశు శుక్లాపై ప్రత్యేక పార్లమెంటరీ చర్చను కూడా ప్రతిపక్షాలు బైకాట్‌‌‌‌ చేశాయి. ఈ సెషన్‌‌‌‌లో మొత్తం 21 రోజులు  సమావేశాలు నిర్వహించగా, ఇందులో లోక్‌‌‌‌సభ కేవలం 37 గంటలు, రాజ్యసభ 42 గంటలు మాత్రమే పనిచేసింది. మిగతా సమయమంతా ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలతో వాయిదాలు కొనసాగాయి.