లక్నో కష్టంగా..4 వికెట్లతో ముంబైపై గెలుపు

లక్నో కష్టంగా..4 వికెట్లతో ముంబైపై గెలుపు
  • రాణించిన స్టోయినిస్‌‌, బౌలర్లు

లక్నో:  రికార్డు స్కోర్లు నమోదవుతూ.. భారీ టార్గెట్లు కరిగిపోతున్న  ఐపీఎల్‌‌17వ సీజన్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌ 145 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో కష్టంగా గెలిచింది. బ్యాటింగ్‌‌లో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్‌‌ చిన్న లక్ష్యాన్ని కాపాడుకునేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది.  మార్కస్ స్టోయినిస్‌‌ (45 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) ఫిఫ్టీతో సత్తా చాటడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో లక్నో  4  వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ఆరో విజయంతో పట్టికలో లక్నో మూడో స్థానానికి చేరుకోగా.. ఏడో ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ఆవిరయ్యాయి.

తొలుత ముంబై 20 ఓవర్లలో 144/7 స్కోరు మాత్రమే చేసింది. నేహల్ వాధెరా (41 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), టిమ్ డేవిడ్ (18 బాల్స్‌‌లో 3 ఫోర్లు 1 సిక్స్‌‌తో 35 నాటౌట్‌‌), ఇషాన్ కిషన్ (36 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 32) రాణించారు. లక్నో బౌలర్లలో మోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 19.2 ఓవర్లలో 145/6 స్కోరు చేసి గెలిచింది. స్టోయినిస్‌‌కు తోడు కేఎల్‌‌ రాహుల్ (28) రాణించాడు. ముంబై బౌలర్లలో పాండ్యా రెండు వికెట్లు తీశాడు. స్టోయినిస్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

ముంబై నింపాదిగా..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన  ముంబై ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది.  మోసిన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌‌‌‌ కొట్టిన రోహిత్ (4) తర్వాతి బాల్‌‌కే స్టోయినిస్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. సూర్యకుమార్ (10) కూడా నిరాశపరిచాడు. ఓ సిక్స్‌‌ కొట్టిన అతను స్టోయినిస్‌‌ బౌలింగ్‌‌లో కీపర్‌‌‌‌కు చిక్కాడు.    ఓ ఎండ్‌లో ఇషాన్ కిషన్ ఆచితూచి ఆడగా.. నవీన్‌‌ వేసిన ఆరో ఓవర్ తొలి బాల్‌‌కు తిలక్‌‌ (7) రనౌటవగా.. రెండో బాల్‌‌కు హార్దిక్ (0) కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌‌ అవ్వడంతో పవర్‌‌‌‌ ప్లేలోనే  28/4తో ముంబై ఇబ్బందుల్లో పడింది.

వాధెర తోడుగా ఇషాన్‌‌ అడపాదడపా బౌండ్రీలు కొడుతూ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, వేగం పెంచే ప్రయత్నంలో 14వ ఓవర్లో బిష్ణోయ్‌‌ స్లో బాల్‌‌ను లైన్‌‌కు అడ్డంగా ఆడిన ఇషాన్‌‌.. మయాంక్‌‌ యాదవ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే వాధెరా 6,6,4 తో ఇన్నింగ్స్‌‌లో కదలిక తెచ్చాడు. బిష్ణోయ్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌తో స్కోరు వంద దాటించిన అతడిని మోసిన్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. నబీ (1) ఫెయిలైనా చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్ ఓ సిక్స్‌‌, మూడు ఫోర్లతో స్కోరు 140 దాటించాడు. 

ఆదుకున్న స్టోయినిస్‌ 

చిన్న టార్గెట్‌‌ను కాపాడుకునేందుకు ముంబై బౌలర్లు చివరి ఓవర్‌‌‌‌ వరకూ పట్టుదలగా పోరాడారు. ఇన్నింగ్స్‌‌ నాలుగో బాల్‌‌కే ఓపెనర్‌‌‌‌ అర్షిన్ కులకర్ణి (0)ని ఎల్బీగా ఔట్‌‌ చేసిన నువాన్ తుషార లక్నోకు షాకిచ్చాడు. కానీ, మరో ఓపెనర్‌‌‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌కు తోడైన మార్కస్‌‌ స్టోయినిస్‌‌ నెమ్మదిగా జోరు పెంచాడు. కొయెట్జీ వేసిన నాలుగో ఓవర్లో మార్కస్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా..  తుషార బౌలింగ్‌‌లో రాహుల్ 4, 6,  4, 4తో  విజృంభించాడు. వీళ్ల జోరుతో పవర్‌‌‌‌ ప్లేలో లక్నో 52/1 స్కోరు చేసింది.

 
అయితే, ఎనిమిదో ఓవర్లో కేఎల్‌‌ను ఔట్‌‌ చేసిన హార్దిక్‌‌ రెండో వికెట్‌‌కు 58రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న మార్కస్‌‌ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. కాసేపు సపోర్ట్ ఇచ్చిన దీపక్ హుడా (18).. హార్దిక్‌‌ బౌలింగ్‌‌లో వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మార్కస్‌‌.. నబీ వేసిన 15వ ఓవర్లో 4,6 కొట్టి  మరో షాట్‌‌కు ట్రై చేసి ఔటవడంతో ముంబై రేసులోకి వచ్చేలా కనిపించింది. చివరి 18 బాల్స్‌‌లో 22 రన్స్ అవసరమైన దశలో వరుస ఓవర్లలో టర్నర్ (5), బదోనీ (6) ఔటైనా నికోలస్‌‌ పూరన్‌‌ (14 నాటౌట్‌‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

సంక్షిప్త స్కోర్లు


ముంబై: 20 ఓవర్లలో 144/7 (నేహల్ 46, డేవిడ్ 35*, మోసిన్ 2/36).
లక్నో: 19.2 ఓవర్లలో 145/6 (స్టోయినిస్ 62,  రాహుల్‌‌ 28, పాండ్యా 2/26)