అడిలైడ్: సొంతగడ్డపై బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకునేలా దూసుకెళ్తోంది. టాపార్డర్‌ను పేసర్ పాట్ కమిన్స్ (3/24), మిడిలార్డర్‌ను స్పిన్నర్ నేథన్ లైయన్ (3/64) దెబ్బ తీయడంతో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి అంచున నిలిచింది.
435 రన్స్ భార్టీ టార్గెట్ ఛేజింగ్‌లో బరిలోకి దిగిన ఇంగ్లిష్ టీమ్ నాలుగో రోజు శనివారం ఆట చివరకు 207/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కమిన్స్ దెబ్బకు బెన్ డకెట్ (4), ఒలీ పోప్ (17) ఫెయిలైనా ఓపెనర్ జాక్ క్రాలీ (85).. జో రూట్ (39)హ్యారీ బ్రూక్ (30)తో కీలక భాగస్వామ్యాలతో జట్టును రేసులో నిలిపాడు. కానీ, లైయన్ తన స్పిన్ మాయాజాలంతో బ్రూక్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (5) క్రాలీని వెంటవెంటనే పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం జెమీ స్మిత్ (2 బ్యాటింగ్), విల్ జాక్స్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ విజయానికి ఇంకా 228 రన్స్ కావాలి. మరో నాలుగు వికెట్లు తీస్తే వరుసగా మూడో విక్టరీతో ఆసీస్ 3–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 271/4తో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 రన్స్‌కు ఆలౌటైంది.
