ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నరు - మధుయాష్కీ

ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నరు - మధుయాష్కీ
  •  భువనగిరి నుంచి పోటీ చేయాలంటున్నరు,నాకిష్టం లేదని చెప్పిన

హైదరాబాద్, వెలుగు :  భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనను కోరారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ చెప్పారు. తనను గెలిపించే బాధ్యత ఆయనే తీసుకుంటానని అన్నారని తెలిపారు. బుధవారం గాంధీభవన్ లో మధు యాష్కీ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయటం ఇష్టం లేదని రాజగోపాల్ రెడ్డితో చెప్పానన్నారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా చేసి వైఎస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు కమ్మ, రావు, రెడ్లు రాజ్యం ఏలారని, రాష్ట్రం వచ్చాక కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇంకా వెనుకబడి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

  • కేసీఆర్ ఏ1, కేటీఆర్ ఏ2.. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల బదిలీలన్నీ కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగాయని మధుయాష్కీ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఏ1 అయితే కేటీఆర్ ఏ2గా ఉంటారని, కేటీఆరే ఇందులో ఎక్కువ పాత్ర ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్​లో అధికారుల విచారణ తర్వాత కేసీఆర్, కేటీఆర్ లనూ విచారించే చాన్స్ ఉందన్నారు. లిక్కర్ స్కాంలో తాను తప్పు చేయలేదని కవిత ఇంత వరకు చెప్పలేదని, కేవలం ఫేక్ కేసు అని మాత్రమే చెబుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను అరెస్ట్ చేయడాన్ని మాత్రమే ఏఐసీసీ తప్పు పట్టిందని, విచారణను వ్యతిరేకించలేదని  ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ బీఆర్ ఎస్ పై తాము పోరాటం చేసినట్లుగానే, ఢిల్లీలో ఆప్ పై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ అధికారులు ఇప్పటికి అదే పోస్టుల్లో కొనసాగుతున్నారని, అన్ని శాఖల్లో ఆ పార్టీ అనుకూల అధికారులే ఉన్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల తర్వాత అవినీతి అధికారులపై విచారణ ఉంటుందన్నారు. కేటీఆర్ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, సీఎం రేవంత్ గతంలో ఒక్క మాట అంటే ఎగిరెగిరి పడ్డ బీఆర్ ఎస్ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న భాష గురించి ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపమని, కేటీఆర్​కు ముందు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన చూసి కేటీఆర్ భయపడిపోతున్నారని మధు యాష్కీ కామెంట్ చేశారు.