వైద్యుల నిర్లక్ష్యం..తల్లి ఒడిలోనే కన్నుమూసిన చిన్నారి

వైద్యుల నిర్లక్ష్యం..తల్లి ఒడిలోనే కన్నుమూసిన చిన్నారి

భోపాల్: చిన్నారికి హై ఫీవర్.. దగ్గర్లోని హెల్త్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పొద్దున్నే తీసుకొచ్చారు.. గంటలు గడిచాయి.. ఒక్క డాక్టర్‌‌‌‌‌‌‌‌ కూడా రాలే.. పట్టించుకున్న దిక్కు లేదు.. ఆస్పత్రి బయట.. అమ్మ ఒడిలో పడుకున్న పిల్లాడు అలానే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.. వైద్యం అందక ఐదేండ్ల చిన్నారి కన్నుమూశాడు. మధ్యప్రదేశ్‌‌‌‌లోని జబల్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్ బయటే జరిగిందీ దారుణ ఘటన. తిన్హెతా డియోరికి చెందిన బాధితులు.. రిషి పండరే(5)కి ఆరోగ్యం బాగాలేకపోవడంతో బుధవారం ఉదయాన్నే స్థానిక బార్గి హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు. డాక్టర్ కోసం ఆస్పత్రి బయట కొన్ని గంటలపాటు ఎదురుచూశారు. కానీ అక్కడ ఏ ఒక్క డాక్టర్‌‌‌‌‌‌‌‌ కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ లేరు. మధ్యాహ్నం 12 గంటల దాకా పిల్లాడికి చికిత్స అందించే దిక్కులేదు.

అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి తమ కండ్ల ఎదుటే అల్లాడిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారా తల్లిదండ్రులు. ఒడిలో ఆయువు లేని కొడుకుతో ఆస్పత్రి బయట కూర్చున్న తల్లి ఆవేదన కన్నీళ్లు పెట్టిస్తున్నది. పిల్లాడు చనిపోయిన కొన్ని గంటల దాకా కూడా హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌కి డాక్టర్లు కానీ, మెడికల్ ఆఫీసర్లు కానీ రాలేదని బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన డాక్టర్‌‌‌‌ చెప్పిన సమాధానం వింటే.. అక్కడ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థవుతుంది. లేట్‌‌‌‌గా రావడానికి కారణమేంటని మీడియా అడిగితే.. ‘‘నా భార్య ఉపవాసం ఉంది. అందుకే మెడికల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కి రావడానికి లేట్ అయింది” అన్నాడాయన.

పిల్లాడు అప్పటికే చనిపోయాడు: కలెక్టర్

ఈ ఆరోపణలను జిల్లా యంత్రాంగం ఖండించింది. పిల్లాడిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లోకేశ్ పరీక్షించాడని, కానీ, అప్పటికే చిన్నారి చనిపోయాడని చెప్పుకొచ్చింది. అబ్బాయి కాలిన గాయాలు కావడంతో స్థానిక ఫిజీషియన్ చికిత్స చేశాడని, తర్వాత హై ఫీవర్, ఇతర కాంప్లికేషన్స్ ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పుకొచ్చింది. ఘటనపై స్పందించిన జబల్‌‌‌‌పూర్ కలెక్టర్​ ఇళయరాజా కూడా.. ‘‘బార్గి ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటికే అబ్బాయి చనిపోయాడు. పిల్లాడికి కాలిన గాయాలున్నాయి. 10 రోజులు స్థానికంగా ట్రీట్‌‌‌‌మెంట్ అందించారు. ఆస్పత్రికి వచ్చాక ట్రీట్‌‌‌‌మెంట్ అందించేందుకు డాక్టర్లు పరిశీలించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు’’ అని చెప్పారు.