నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. రంగంలోకి సీబీఐ..!

నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. రంగంలోకి సీబీఐ..!

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సంచలనం సృష్టిస్తోన్న నటి ట్విషా శర్మ అనుమానస్పద మరణ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సీబీఐకి లేఖ రాయనున్నారు. ట్విషా శర్మ కేసును విచారించాలని ఆయన సీబీఐని కోరనున్నారు. 

నటి ట్విషా శర్మ 2026, మే 12న తన అత్తగారింట్లో అనుమానస్పద స్థితిలో మరణించింది. న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే అత్తగారింట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. ట్విషా మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్విషాను ఆమె భర్త, అత్తమామలే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విషా మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం (మే 20) ట్విషా పేరెంట్స్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‎ను కలిశారు. 

ఈ సందర్భంగా ట్విషా శర్మ మరణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తానని మృతురాలి తల్లిదండ్రులకు సీఎం హామీ ఇచ్చారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరపాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వం సీబీఐ లేఖ రాస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రీ పోస్ట్‎మార్టం కోసం ట్విషా మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లాలనుకుంటే అందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. 

►ALSO READ | ధురంధర్-2లో దేశ భద్రత సీక్రెట్స్ లీక్ చేశారా..? కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు

కాగా, ట్విషా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ కూతురి డెడ్ బాడీని తీసుకునేందుకు ట్విషా తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. ట్విషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎనిమిది రోజులుగా ట్విషా డెడ్ బాడీ భోపాల్ ఎయిమ్స్‎లోనే ఉంది. డెడ్ బాడీ కుళ్లిపోతుందని.. ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని పోలీసులు ట్విషా ఫ్యామిలీకి లేఖ రాశారు. కానీ రీ పోస్ట్ మార్టం కోసం పట్టుబడుతోన్న ట్విషా పేరెంట్స్ డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. 

ట్విషా శర్మది ఆత్మహత్యే: పోలీసులు

అనుమానస్పద స్థితిలో మరణించిన ట్విషా శర్మది ఆత్మహత్యేనని పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, వరకట్న వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు ప్రేరేపించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలో ట్విషా డ్రగ్స్ తీసుకున్నట్లు లేదని.. మా దర్యాప్తులో కూడా అలాంటి విషయాలేవీ లభించలేదని వివరణ ఇచ్చారు.