V6 News

Akhanda 2 Update: ‘అఖండ 2’ రిలీజ్పై వీడిన ఉత్కంఠ.. మద్రాస్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌!

Akhanda 2 Update:  ‘అఖండ 2’ రిలీజ్పై వీడిన ఉత్కంఠ.. మద్రాస్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌!

బాలకృష్ణ నటించిన అఖండ-2 విడుదలకు మద్రాస్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. Eros మరియు 14Reels సెటిల్‌మెంట్ ఒప్పందం సమర్పించడంతో మద్రాస్ హైకోర్టు అఖండ-2 విడుదలకు అనుమతి లభించింది. ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా అఖండ-2 విడుదల కావాల్సి ఉండగా మద్రాసు హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో గడిచిన 4 నాలుగు రోజులపాటు 14 రీల్స్ & ఈరోస్ ఇంటర్నేషనల్‌ సంస్థల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో ఇవాళ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అఖండ 2కి లైన్ క్లియర్ అయింది.

అయితే, అఖండ 2కి మరో చిక్కు కూడా ఉంది. లోకల్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ మరియు డిస్ట్రిబ్యూటర్లు పెండింగ్ పేమెంట్లు క్లియర్ చేయడంపైనే రిలీజ్ ఆధారపడి ఉంది. అందువల్ల అఖండ రిలీజ్ విషయంపై, నిర్మాణ సంస్థ 14 రీల్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్ 12న) అఖండ-2 విడుదల అవుతుందని లేటెస్ట్ టాక్ బయటకొచ్చింది. గురువారం డిసెంబర్ 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ అప్డేట్ బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహం తీసుకురానుంది. గడిచిన వారం మొత్తం కొత్త సినిమాలు లేక బోసిపోయిన థియేటర్స్.. ఇక అఖండ 2 రాకతో జోష్ తీసుకురానుంది. అయితే, విడుదలపై మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే!

అసలేం జరిగిందంటే:

శుక్రవారం (డిసెంబర్ 5న) విడుదల కావాల్సిన  ‘అఖండ 2’ అనూహ్య పరిణామాల నడుమ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్‌‌ ప్లస్‌‌ సంస్థ తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించేవరకు సినిమాను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో బాలీవుడ్‌‌ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌‌ (Eros International Media Ltd) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రిలీజ్​ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది. జస్టిస్ SM సుబ్రమణ్యం, జస్టిస్ సి.కుమరప్పన్తో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. 

ఇక ఇప్పుడు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు Eros సంస్థకు అనుకూలంగా రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. పూర్తి ఆర్బిట్రల్ అవార్డు మొత్తం 27 కోట్ల 80 లక్షల 18 వేల 13 రూపాయలు.. 14 శాతం వడ్డీ ఈరోస్‌కు చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని అఖండ 2 విడుదలకు ముందు మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గడిచిన 4 నాలుగు రోజులపాటు జరిగిన సుదీర్ఘ చర్చతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఇక ఇవాళ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో డిసెంబర్ 12న రాబోతున్నట్లు సినీ వర్గాల టాక్.