
- పవర్ కట్తో ఎగ్జామ్ సరిగా రాయలేదని స్టూడెంట్ల కేసు
మద్రాస్: వచ్చే నెల 14న విడుదల కావాల్సిన నీట్ యూజీ 2025 ఫలితాల ప్రకటనపై మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. కొన్ని సెంటర్లలో పవర్ కట్ వల్ల తాము ఎగ్జామ్ సరిగా రాయలేదని పేర్కొంటూ 13 మంది స్టూడెంట్లు మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. ఈ నెల 4న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. చెన్నైలోని అవడి ఏరియాలో కేంద్రీయ విద్యాలయ సెంటర్ లోనూ ఎగ్జామ్ జరిగింది.
అయితే, పరీక్ష జరుగుతున్న సమయంలో భారీగా వర్షం పడడంతో కరెంటు పోయిందని, సెంటర్ లో జనరేటర్ గానీ, ఇన్వర్టర్ గానీ ఏవీ లేవని, దీంతో చీకట్లో పరీక్ష సరిగా రాయలేదని స్టూడెంట్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు కనీసం ఎక్స్ ట్రా టైమ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కొంతమంది కొవ్వొత్తుల వెలుగులో పరీక్ష రాయాల్సి వచ్చిందని, మరికొందరు చీకట్లోనే పరీక్ష రాశారని తెలిపారు. అంతేకాకుండా వర్షపు నీరు ఎగ్జామ్ హాల్ లోకి ప్రవేశించడంతో సీట్ల నుంచి లేవాల్సి వచ్చిందని, దీంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని వివరించారు.
దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలతో పోలిస్తే, అవడి ఏరియాలోని కేంద్రీయ విద్యాలయంలో సౌకర్యాలు ఏమాత్రం బాగా లేవని తెలిపారు. విద్యార్థుల పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంత వరకూ నీట్ 2025 ఫలితాల వెల్లడిపై తాత్కాలికంగా స్టే విధిస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. కాగా.. విద్యార్థులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై నీట్ నిర్వాహకులపై హైకోర్టు సీరియస్ అయింది. విద్యార్థుల హక్కులను ఉల్లంఘించారని మండిపడింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా..
నీట్ యూజీ 2025 ఫలితాల ప్రకటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా శుక్రవారం స్టే విధించగా.. శనివారం దానిని సవరించింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పవర్ కట్ కావడంతో ఎగ్జామ్ సరిగా రాయలేదని ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సుబోధ్ అభయంకర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఈ నెల 4న ఇండోర్ లోని పలు సెంటర్లలో నీట్ యూజీ 2025 పరీక్ష నిర్వహించారని, కొన్ని సెంటర్లలో కరెంటు పోవడంతో స్టూడెంట్లపై ప్రభావం పడిందని ఆ యువతి తరపు అడ్వకేట్ పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్లలో పవర్ బ్యాకప్ లేదని, దీంతో కొవ్వొత్తి వెలుగులో విద్యార్థులతో పరీక్ష రాయించారని తెలిపారు.
జడ్జి జస్టిస్ సుబోధ్ స్పందిస్తూ.. పరీక్ష ఏర్పాట్లలో రాజీపడ్డారని, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని సీరియస్ అయ్యారు. తదుపరి విచారణ తేదీ ప్రకటించే వరకూ నీట్ ఫలితాలు వెల్లడించకూడదని ఆదేశించారు. అయితే, హైకోర్టు శనివారం తన ఆదేశాన్ని సవరిస్తూ తీర్పు ఇచ్చింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేవలం 11 సెంటర్లలో కలిగిన ఇబ్బంది వల్ల దేశవ్యాప్తంగా ఫలితాలపై స్టే విధించడం సరికాదన్నారు. ఆయన వాదనలతో ఏకీభవించిన బెంచ్.. ఇండోర్ లో ఇబ్బంది తలెత్తిన 11 సెంటర్లు మినహా దేశంలోని మిగతా సెంటర్లలో నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు డిక్లేర్ చేయవచ్చని స్టేను సవరించింది.