ఆ అధికారి పరువు తీయాలనే తుపాకులు ఎత్తుకెళ్లా..ఆర్మీ ఆయుధాల చోరీ కేసు నిందితుడు మల్లేశ్

ఆ అధికారి పరువు తీయాలనే తుపాకులు ఎత్తుకెళ్లా..ఆర్మీ ఆయుధాల చోరీ కేసు నిందితుడు మల్లేశ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని బొల్లారంలో ఉన్న మద్రాస్ రెజిమెంట్‌‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మద్రాస్ రెజిమెంట్‌‌లో  ఓ ఉన్నతాధికారి వేధింపులకు గురి చేశాడని..ఆయన పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఆయుధాలు చోరీ చేసినట్లు నిందితుడు మాజీ ఆర్మీ హవల్దార్ మల్లేశ్ పోలీసులకు వెల్లడించాడు.

అధికారిపై కక్ష తీర్చుకొనేందుకే పక్కా పథకం ప్రకారం దొంగతనం చేసినట్లు స్పష్టం చేశాడు. ఇందుకోసం ఆరు నెలల ముందే స్కెచ్ వేసినట్లు వెల్లడించాడు. 10 రోజుల కస్టడీలో భాగంగా చంచల్ గూడ జైలు నుంచి నిందితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం కార్ఖానాలోని ఏసీపీ కార్యాలయానికి తరలించి, విచారించారు.

ముందుగా వ్యక్తిగత వివరాలు సహా ఉద్యోగంలో చేరక ముందు, చేరిన తర్వాత అతడి అలవాట్లతో కూడిన స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. కాగా, ఉద్యోగంలో చేరక ముందే రెండు చోరీ కేసుల్లో మల్లేశ్ నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే రెజిమెంట్‌‌లో దురుసు ప్రవర్తన, విధుల్లో నిర్లక్ష్యం సహా పలు కారణాలతో రెజిమెంట్ ఉన్నతాధికారి ఒకరు మల్లేశ్ పై చర్యలు తీసుకున్నాడు. ఈ మేరకు విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, బుధవారం రెండో రోజు విచారణలో మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఆధారాలతో కూడిన ప్రశ్నలు రూపొందించారు.