కిక్కు కోసం కల్లులో క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్న మాఫియా

కిక్కు కోసం కల్లులో క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్న మాఫియా
  • ఒక్కరోజు తాగకున్నా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నరు
  • పక్క రాష్ట్రాల నుంచి జిల్లాల్లోని డిపోలకు చేరుతున్న సరుకు
  • కల్లు కాంపౌండ్లలో తనిఖీలు వద్దని ఓ మంత్రి నుంచి ఆదేశాలు!
  • కల్తీ కల్లు వల్ల వ్యాపారం దెబ్బతిని నష్టపోతున్న గౌడ కులస్తులు
  • గతంలో అల్ప్రాజోలం, డైజోఫామ్​తో కృత్రిమ కల్లు చేసిన ముఠాలు
  • ఇప్పుడు క్లోరల్ హైడ్రేట్​తో తయారీ.. ప్రమాదమంటున్న ఎక్స్‌‌‌‌పర్టులు


బీహార్ నుంచి 32 ఏండ్ల వ్యక్తి బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు. కూలి పని అయిపోయాక కల్లు తాగడం అతడికి అలవాటైంది. కల్తీ కల్లు కావడంతో క్రమంగా బానిసయ్యాడు. మొదట్లో ఒక సీసాతో మొదలై, తర్వాత పెంచుతూ పోయాడు. మత్తు తలకెక్కి ఊరంతా పిచ్చి పట్టినట్టు తిరుగుతుండటంతో భయాందోళన చెందిన స్థానికులు అతన్ని పట్టుకొని ఇటీవల పోలీసులకు అప్పగించారు. కల్తీ కల్లు వల్లే అలా ప్రవర్తించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

నల్గొండ/ మహబూబ్‌‌‌‌నగర్, వెలుగు:ఈదులు లేకున్నా, తాళ్లు గీయకున్నా.. కల్తీ కల్లు మాత్రం ఏరులై పారుతున్నది. అసలు కల్లు చుక్క అనేదే లేకుండా పూర్తిగా కెమికల్స్‌‌‌‌తో తయారు చేస్తున్న కృత్రిమ కల్లు.. పేద కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. గతంలో కిక్కు కోసం అల్ప్రాజోలం లాంటి రసాయనాలు కలిపిన మాఫియా.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ప్రమాదకరమైన క్లోరల్​హైడ్రేట్​కలుపుతున్నది. ఈ కల్లుకు బానిసైన వారి పరిస్థితి డ్రగ్స్ అడిక్టర్స్ కన్నా దారుణంగా ఉంటున్నది. ఒక్క రోజు కల్లు తాగకపోయినా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. కల్తీ కల్లుకు బానిసైన వారు దుబాయ్, కువైట్, మస్కట్ వెళ్తే.. అక్కడ కెమికల్ కల్లు దొరక్క మతిస్థిమితం కోల్పోయి రోడ్ల వెంట తిరుగుతున్న ఘటనలు బయటపడుతున్నాయి.


ఈ తరహా కృత్రిమ కల్లు డిపోలపై ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫిర్యాదులు రావడంతో ఇటీవల పలుచోట్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. శాంపిల్స్​తీసి పరీక్షించగా కల్లులో అధిక మోతాదులో క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్నట్లు తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కల్లు డిపోల్లో తనిఖీలకు ఆ శాఖ సిద్ధమైంది. వెంటనే రంగంలోకి దిగిన మాఫియా.. ఓ మంత్రి ద్వారా ఒత్తిడి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిలిపేసినట్లు తెలిసింది.

లిక్కర్ రేట్లు పెరగడంతో కల్తీ కల్లు వైపు..

రాష్ట్ర  ప్రభుత్వం గత మూడేండ్లలో రెండు సార్లు లిక్కర్ రేట్లు పెంచింది. 2022 మేలో పెంచిన రేట్ల ప్రకారం రూ.200 లోపు ఎమ్మార్పీ ఉన్న ఛీప్ లిక్కర్ ధరలు రూ.20 నుంచి రూ.80‌‌ దాకా, అంతకంటే ఎక్కువ ఎమ్మార్పీ ఉన్న బ్రాండ్లు రూ.40 నుంచి రూ.160 దాకా పెరిగాయి. దీంతో కూలినాలి చేసుకునేవాళ్లు తక్కువ ధరకు వచ్చే కృత్రిమ కల్లు వైపు మొగ్గు చూపుతున్నారు. పల్లెల్లో సీసా కల్లు రూ.10కి, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో రూ.20, ఆలోపే వస్తుండడంతో త్వరగా అలవాటు పడిపోతున్నారు. వాస్తవానికి తెలంగాణ వచ్చాక కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా కల్లు కాంపౌండ్లకు పర్మిషన్​ఇచ్చింది. దీన్ని అదునుగా భావించిన కొన్ని ముఠాలు.. రాష్ట్రవ్యాప్తంగా కల్లు డిపోలు, దుకాణాలు తెరిచి కెమికల్ కల్లు తయారు చేసి విక్రయిస్తున్నాయి. బెల్టుషాపుల తరహాలో వాడవాడలా కల్లు కాంపౌండ్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా పేద, దిగువ మధ్య తరగతి జనాలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే అక్రమంగా షాపులు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 400 కాంపౌండ్లు ఉండగా, అనధికారికంగా మరో 400 దాకా నడుస్తున్నాయి. వనపర్తి జిల్లాలో 225, నారాయణపేటలో 275, గద్వాలలో 143, మహబూబ్​నగర్​లో 239, నాగర్​కర్నూల్​లో 200 కల్లు కాంపౌండ్లు రన్ అవుతున్నాయి. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ వందలాది దుకాణాలు నడుస్తున్నాయి. సరిపడా ఈత, తాటి చెట్లు ఉన్న గ్రామాల్లో గౌడ కులస్థులు నడిపిస్తున్న కల్లు కాంపౌండ్లలో పెద్దగా కల్తీ లేకున్నా ఎలాంటి చెట్లు లేని చోట్ల కొన్ని ముఠాలు నడుపుతున్న మెజారిటీ కాంపౌండ్లలో క్లోరల్ హైడ్రేట్ తో కల్తీ చేసి అమ్ముతున్నారు.

ముంబై, సూరత్ నుంచి కెమికల్

ఇటీవల మహబూబ్​నగర్, మెదక్, నల్గొండ జిల్లాలో పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు చేసిన దాడుల్లో క్లోరల్​ హైడ్రేట్ పట్టుబడింది. దీనిపై కూపీ లాగితే కల్తీ కల్లు బాగోతం బయటపడింది. ముంబై, సూరత్ నుంచి కొరియర్ల ద్వారా అక్రమ మార్గంలో హైదరాబాద్‌కు క్లోరల్ హైడ్రేట్ రవాణా అవుతున్నట్లు ఆబ్కారీ ఆఫీసర్లు గుర్తించారు. మొదట హైదరాబాద్‌కు, అక్కడి నుంచి కార్లు, బైకులపై ఆయా జిల్లాలకు సప్లై అవుతున్నట్లు తేల్చారు. ఏజెంట్లు కోడ్ లాంగ్వేజ్ ఆధారంగా సరుకును కల్లు డిపోలకు చేర్చుతున్నారు. కొద్ది రోజుల కింద ఒక బ్లాక్ స్కార్పియోలో గద్వాల ప్రాంతానికి పెద్ద మొత్తంలో కెమికల్స్ తరలిస్తుండగా అడ్డాకుల సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. నిజానికి గతంలో కల్లు తయారీకి అల్ప్రాజోలం, డైజోఫామ్ మిశ్రమాన్ని వాడేవారు. చైనా, కొరియా దేశాల నుంచి దిగుమతి అయ్యే వీటి రేటు క్లోరల్ హైడ్రేట్ తో పోలిస్తే ఎక్కువ. 30 కేజీల క్లోరల్ హైడ్రేట్​హోల్​సేల్​లో రూ.3 వేల నుంచి 4 వేలకు దొరకితే.. అల్ప్రాజోలం, డైజోఫామ్ కేజీ రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా ఉంటున్నది. పైగా అల్ప్రాజోలంతో పోలిస్తే క్లోరల్ హైడ్రేట్​వల్ల కిక్కు ఎక్కువగా వస్తుండడంతో దీన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.


నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఏఎన్ఎం (42)కు రోజూ కల్లు తాగడం అలవాటు. కొద్ది రోజుల కింద ఇంట్లో వారు కల్లు తాగొద్దని మందలించడంతో వారం పాటు ఆమె కల్లు తాగలేదు. దీంతో వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. స్థానిక సర్కారు దవాఖానకు, అక్కడి నుంచి మహబూబ్​నగర్ జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ హాస్పిటల్​కు తరలించారు. నెలన్నర రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత మామూలు స్థితికి వచ్చింది.

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తూరు, అయ్యవారిపల్లి గ్రామాలకు చెందిన కొందరు.. పక్కనే ఉన్న వెలుగోముల గ్రామంలోని దుకాణానికి వెళ్లి కల్లు తాగుతున్నారు. కల్లులో ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతున్నారంటూ ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫిర్యాదులు రావడంతో.. అధికారులు దుకాణాన్ని మూసేశారు. దీంతో రెండు గ్రామాల్లో ఈ కల్లుకు అలవాటు పడిన 14 మంది వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారిని జడ్చర్ల హాస్పిటల్‌కు తరలించారు.

మంత్రి ఫోన్లతో అధికారుల హడల్

కల్లు తయారీలో క్లోరల్ హైడ్రేట్ వాడకం మొదలైనప్పటి నుంచి సేల్స్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రోజుకు నాలుగైదు బాక్సులు మాత్రమే అమ్ముడయ్యే దుకాణంలో.. ఇప్పుడు ఏకంగా 80 బాక్సులు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. పేదలను టార్గెట్ చేసి, వాళ్లు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఈ తరహా కల్లు దుకాణాలు ఓపెన్ చేసినట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆరు నెలల కిందట మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌‌లోని ఓ దుకాణం నుంచి ఎన్ ఫోర్స్​మెంట్​ఆఫీసర్లు పెద్ద మొత్తంలో క్లోరల్ హైడ్రేట్​ను సీజ్ చేసి కేసు పెట్టారు. కానీ ఆ జిల్లాలోని ఓ ముఖ్యనేత ఫోన్ కాల్ రావడంతో మార్గమధ్యలోనే అధికారులు కేసు పేపర్లు చింపేసి, సీజ్ చేసిన మెటీరియల్​ను తిరిగి అదే షాపులో వదిలిపెట్టి వచ్చారు. ఈ ఘటన డిపార్ట్​మెంట్​లో సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా సదాశివపేట కల్లు దుకాణంలో రెండు నెలల క్రితం స్టేట్ టాస్క్​ఫోర్స్​ టీమ్ దాడులు చేసింది. అక్కడి నుంచి శాంపిల్స్ సేకరించిన ఆఫీసర్లు వాటిని టెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, పై నుంచి పొలిటికల్ ప్రెజర్స్ వచ్చాయి. దీంతో సేకరించిన శాంపిల్​ను తిరిగి అదే డిపోలో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. నకిరేకల్, నల్గొండలో మూడు నెలల క్రితం క్లోరల్ హైడ్రేట్ మిశ్రమాన్ని కారులో తరలిస్తుండగా ఎన్​ఫోర్స్​మెంట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. దాదాపు 300 కేజీల మిశ్రమాన్ని సీజ్ చేశారు. ఈ విషయం కూడా  బయటకు తెలియనివ్వలేదు.

అలవాటు పడితే అంతే

క్లోరల్ హైడ్రేట్ మిశ్రమంతో కలిపిన కల్లుకు అలవాటు పడ్డ వాళ్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటున్నదని డాక్టర్లు చెప్తున్నారు. అల్ప్రాజోలం, డైజోఫాం మిశ్రమంతో తయారు చేసిన కల్లు రోజుకు ఒకటి, రెండు సీసాలతో తాగి ఆపేస్తారు. కానీ క్లోరల్ హైడ్రేట్ తో తయారు చేసిన కల్లు.. ప్రతి నాలుగు గంటలకోసారి తాగాలనిపించేలా చేస్తుంది. ఆకలి మందగించి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. బరువు కోల్పోవడంతో పాటు ఆలోచనాశక్తి తగ్గుతుంది. న్యూరో, గ్యాస్ట్రిక్ సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్, ఫిట్స్​వస్తాయి. కల్లు దొరక్కపోతే పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. రోడ్ల వెంట అరుస్తూ పరుగెడుతారు. కల్లు దొరికితే తప్ప సాధారణ స్థితికి రావడం కష్టం. దీంతో ఏదైనా ఊరికి వెళ్తే వెంట సంచిలో కల్లు సీసాలు పెట్టుకొని పోతున్నారు. దీనికి అలవాటు పడ్డవాళ్లకు లిక్కర్ కూడా కిక్కు ఇవ్వడం లేదు. ఆయా జిల్లాల్లో మద్యం సేల్స్ తగ్గిపోవడానికి ఇదో ప్రధాన కారణమని ఎక్సైజ్ అధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు.


కల్తీ కల్లు మత్తులో ఉరేసుకున్నడు

మా బంధువు కల్తీ కల్లుకు అలవాటు పడ్డడు. అది దొరక్క పిచ్చిపట్టినట్లు చేసిండు. పశువుల కొట్టంలో ఉరేసుకున్నడు. కల్తీ కల్లు కారణంగా ఆరుగురు చనిపోయిన్రు. మైకంలో మణెమ్మ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దాన్ని తాగడం ఆపేస్తే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నరు. చేతిలో ఏది ఉంటే దానితో కొడుతున్నరు. సిగం వచ్చినట్లు అరుస్తున్నరు. చేసేదిలేక వదిలేస్తున్నం. ఊర్లలో పొద్దున ఏడు గంటల నుంచే కల్లు దుకాణాలు నడిపిస్తున్నరు. ఆడోళ్లంతా కలిసి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే కల్లు శాంపిల్ తీసుకువెళ్లారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- తారకమ్మ, నాగవరం, వనపర్తి జిల్లా


ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటది

క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలం వంటి కెమికల్స్ ఉపయోగించి తయారు చేసే కల్తీ కల్లు చాలా హానికరం. దీనికి అలవాటు పడితే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆకలి తగ్గిపోయి బరువు కోల్పోతారు. ఆలోచన శక్తి తగ్గుతుంది. న్యూరో, కార్డియాక్, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఫిట్స్ వస్తాయి. కల్తీ కల్లుకు అడిక్ట్ అయితే అది లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తారు. తిరిగి కోలుకోవడం చాలా కష్టం. కల్తీ కల్లుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- పి.చంద్రశేఖర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, మెదక్