మాగంటికి హైకోర్టులో చుక్కెదురు..ఎన్నికల పిటిషన్‌‌లో ఆధారాలున్నయ్‌‌..

మాగంటికి హైకోర్టులో చుక్కెదురు..ఎన్నికల పిటిషన్‌‌లో ఆధారాలున్నయ్‌‌..
  • మధ్యంతర పిటిషన్‌‌నుకొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌‌లను కొట్టివేయాలంటూ మాగంటి గోపీనాథ్‌‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్నికల పిటిషన్‌‌లో ప్రాథమిక ఆధారాలున్నాయని, వీటిని ప్రాథమిక దశలోనే తిరస్కరించలేమని తేల్చి చెప్పింది. గతంలో ఇదే అభ్యంతరంపై పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టివేయగా మాగంటి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

సీపీసీ నిబంధనను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలతో  హైకోర్టు మరోసారి విచారణ చేపట్టి కొట్టివేసింది. ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్‌‌ అభ్యర్థి అజారుద్దీన్, ఓటరు వి. నవీన్‌‌ యాదవ్‌‌లు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లను తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్‌‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌పై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. అజారుద్దీన్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 26 ఈవీఎంల్లో లోపాలున్నాయని, మరో 39 బూత్‌‌ల్లోని ఈవీఎంల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. వీవీపాట్లు, పోలింగ్‌‌ ఏజెంట్లు సమర్పించిన ఓట్ల లెక్కలకు పొంతన కుదరడంలేదని చెప్పారు. వీటన్నింటిపై డిసెంబరు, జనవరిలో ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

ఓటరు నవీన్‌‌ యాదవ్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌లో నామినేషన్‌‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌‌లో వాస్తవాలను తొక్కిపెట్టారని, అందువల్ల మాగంటి గోపీనాథ్‌‌ ఎన్నికను రద్దు చేయాలని కోరారు. గతంలో డిగ్రీ అని పేర్కొన్న మాగంటి తరువాత ఇంటర్మీడియట్‌‌ అని పేర్కొన్నారని, పెళ్లి అయి కుమారుడు ఉన్నారని, అయితే వారి ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎన్నికల పిటిషన్‌‌ను తిరస్కరించాలన్న అభ్యర్థనను ప్రాథమిక దశలోనే పరిగణనలోకి తీసుకోలేమన్నారు.. ఎన్నికల పిటిషనర్‌‌ తగిన ఆధారాలను సమర్పించారని పేర్కొన్నారు.  అందువల్ల ఎన్నికల పిటిషన్‌‌లో విచారించాల్సిన అంశాలున్నాయంటూ మాగంటి గోపీనాథ్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.