మ్యాజిక్ మష్రూమ్స్ తింటే కిక్కే కిక్కు…

మ్యాజిక్ మష్రూమ్స్ తింటే కిక్కే కిక్కు…

హెల్యూసిజినేషన్. జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు మనసు ఎటెటో వెళ్లిపోవడం. ఇలా హెల్యూజినేషన్ కలిగించే వాటిలో మ్యాజిక్ మష్రూమ్స్ కూడా ఒకటి! వీటిని తింటే చాలు ఊహల్లో తేలిపోవచ్చు. ఎదుటివారి మాటలు చెవికెక్కవు. రెక్కలు లేకున్నా గాల్లో ఎగురుతున్నట్లు.. ఎదుటివాళ్ల ఆకారం మారిపోయినట్లు.. చెట్లు పొట్టివిగా అయిపోయినట్లు.. చిన్న చీమ ఏనుగంతైనట్లు కనిపిస్తాయి. మొత్తంగా ప్రపంచాన్ని మరో కోణంలో చూసేస్తారు. రుచిగా ఉన్నాయని మరిన్ని నమిలారనుకోండి.. నాలుగైదు రోజులు అలా మత్తులో ఓలలాడుతూ ఉండిపోతారు! ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశాలూ ఉన్నాయి.

అంతటి ప్రమాదకరమైన మేజిక్ మష్రూమ్స్ పై అమెరికాలోని డెన్వర్ సిటీ నిషేధాన్ని ఎత్తేసింది. వీటిని తినే వాళ్లపై చర్యలు తీసుకోకుండా చట్టం చేసింది. ఇందుకోసం జరిగిన ఓటింగ్ లో 50.56 శాతం మంది డెన్వర్ వాసులు పుట్టగొడుగు వాడకానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో 21 ఏళ్లు దాటిన వాళ్లకు ఈ పిచ్చెక్కించే పుట్టగొడుగులను అమ్మొచ్చని డెన్వర్ నగరం నిర్ణయించింది. అయితే, పెద్ద మొత్తంలో అమ్మకాలు చేయకూడదని షరతు విధించింది.

ఏంటీ మేజిక్ పుట్టగొడుగులు?

ఒక రకమైన ఫంగస్ తో ఈ పుట్టగొడుగుల తయారవుతాయి. వీటిలో ‘సిలోసిబిన్’ అనే కెమికల్ ఉంటుంది. మనిషికి పిచ్చి పిచ్చి ఊహలు రావడానికి కారణమిదే. వీటిని తిన్న వారికి ఎదుటివాళ్లు వింతగా కనిపిస్తారని, మాటలు చిత్రంగా వినిపిస్తాయని, ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తారని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంది. అమెరికా ‘సిలోసిబిన్’ను హెరాయిన్, ఎల్ఎస్డీ లాంటి డ్రగ్ గా పరిగణిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించాయి.