యాదాద్రిలో మహా క్రతువు

యాదాద్రిలో మహా క్రతువు

యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహుడి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు సోమవారం ప్రారంభమైంది. త్రిదండి చినజీయర్ పెట్టిన ముహూర్తం ప్రకారం సప్తాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. మహా కుంభ సంప్రోక్షణ పూజల్లో భాగంగా పంచకుండాత్మక సుదర్శన యాగంతో ఉద్ఘాటన పర్వాలకు తెరలేచింది. నిత్య ఆరాధనల అనంతరం స్వయంభూ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రధానాలయంలో భగవత్ ఆజ్ఞ తీసుకుని ఉదయం 11 గంటలకు బాలాలయంలో అర్చకులు స్వస్తివాచనంతో పంచకుండాత్మక సుదర్శన యాగం ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పుణ్యాహవచనం, విష్వక్సేన పూజ, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన రిత్విక్ వరుణం, అఖండజ్యోతి ప్రజ్వలన పూజలతో యాగాన్ని మొదలుపెట్టారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం సోమవారం మొదలైన సుదర్శన యాగం ఈ నెల 28 వరకు జరగనుంది. 28న మహా కుంభ సంప్రోక్షణ ద్వారా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ఉద్ఘాటన జరగనుంది. అదే రోజు నుంచి స్వయం భూ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

ప్రధానాలయంలో వాస్తుపూజలు
పంచకుండాత్మక మహా కుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా ప్రధానాలయంలో వాస్తుపూజలు చేశారు. ప్రధానాలయ ముఖ మంటపంలో 'వాస్తు పురుషుడి' బొమ్మను గీసి వాస్తుపూజలు ప్రారంభించారు. తర్వాత వాస్తుబలి, వాస్తు హోమం, వాస్తు పర్వగ్నకరణం నిర్వహించారు.ఈ పూజల వల్ల శిల్పాలు, విగ్రహాలు, ఆలయానికి వాస్తుదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. బాలాలయంలో యాగశాల ప్రవేశ కార్యక్రమాలను అర్చకులు శాస్త్రపరంగా చేపట్టారు. మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన పూజలను చేశారు. సుదర్శన యాగం కోసం యాగశాలలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుధ్, మహాలక్ష్మి పేర్లతో ఐదు కుండలాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనంతో సుదర్శన యాగం ప్రారంభించి, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణంతో యాగశాల ప్రవేశం చేశారు. 

నారసింహుడి చెంతకు గోదావరి
నారసింహుడి చెంతకు గోదావరి జలాలు చేరుకున్నాయి. మల్లన్న సాగర్ నుంచి శనివారం విడుదల చేసిన గోదావరి జలాలు సోమవారం గండిచెరువుకు చేరుకున్నాయి. ఈవో గీతారెడ్డి ప్రత్యేక పూజలు చేసి గోదావరి నీళ్లను గండిచెరువులోకి వదిలారు. గోదావరి జలాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రాగిబిందెలో తీసుకొచ్చి యాదాద్రి నరసింహస్వామికి సమర్పించారు. గోదావరి నీళ్లకు ఆలయ అర్చకులు మంత్రవేష్ణితం చేసి సంప్రోక్షణ పూజలు చేశారు.

కుంభ సంప్రోక్షణ పూజల్లో నేటి పర్వాలు
పంచకుండాత్మక సుదర్శన యాగంలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు.. తిరిగి సాయంత్రం 6 నుంచి పలు పూజలు నిర్వహిస్తారు. ఉదయం శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ట, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనాలు, మూలమంత్ర హవనాలు, నిత్య లఘు పూర్ణాహుతి ఉంటుంది. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, నిత్యవిశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి జరుపుతారు.