అది ఆటో నా ?? మినీ బస్సా ?? ఏకంగా 17 మంది

అది ఆటో నా ?? మినీ బస్సా ?? ఏకంగా 17 మంది

మహబూబ్‌నగర్: ప‌రిమితికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకున్న‌ ఆటోను నిలిపివేసిన పోలీసులు షాక్ తిన్నారు. ఆ ఆటోలో ఏకంగా 17 మంది ప్ర‌యాణికుల‌ను చూసి నివ్వెర‌పోయారు. ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మంది ప్రయాణీస్తున్నారు.ఈ ఆటోలో నుండి 17 మంది దిగగానే పోలీసులు షాక్ తిన్నారు. ఈ ఫోటోను ట్విట్టర్లో పోలీసులు షేర్ చేశారు. ఈ ఫోటోపై తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది.

‘ఏందన్నా..! అది ఆటో నా ? మినీ బస్సా ? 7 సీటరా లేక 14 సీటరా ? ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?’ అంటూ కామెంట్‌ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు డ్రైవర్‌ తీరుపై విస్మయం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆటో ఎక్కే ప్రయాణికులకు కూడా సోయి ఉండాలి కదా అని విమర్శిస్తున్నారు.

ఈ విషయమై మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పోలీసులు ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఓవర్ లోడ్ తో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆటోలో ప్రయాణించేవారికే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు వారికి వివరించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణీకులను తరలించవద్దని పోలీసులు కోరారు. బాలానగర్ కు చెందిన బ్లూకాట్ అధికారులు నర్సింహ్ములు లక్ష్మణ్ లు ఈ ఆటోను నిలిపివేసి డ్రైవర్ సహా ప్రయాణీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.