బీజేపీకి హిమాయత్​నగర్ కార్పొరేటర్ రాజీనామా .. బీఆర్ఎస్​లో చేరిన మహాలక్ష్మి, రామన్ గౌడ్ దంపతులు

బీజేపీకి హిమాయత్​నగర్ కార్పొరేటర్ రాజీనామా .. బీఆర్ఎస్​లో చేరిన మహాలక్ష్మి, రామన్ గౌడ్ దంపతులు

బషీర్​బాగ్, వెలుగు: బీజేపీకి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, ఆమె భర్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్ గౌడ్ రాజీనామా చేశారు.  నారాయణగూడలోని ఓ హోటల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటిస్తూ కంటతడి పెట్టుకున్నారు. 36 ఏండ్లుగా బీజేపీలో ఉన్నానని.. తన పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కార్పొరేటర్ మహాలక్ష్మి భర్త రామన్ గౌడ్ తెలిపారు.

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి తనను మానసికంగా వేధించారని.. ఇటీవల దాడి చేయించాడని రామన్ గౌడ్ ఆరోపించారు. బీసీ నేత అయిన తనను ఎదగనీయకుండా చింతల అడ్డుకున్నాడని.. దీనిపై రాష్ట్ర నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని రామన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ అయిన తన భార్య మహాలక్ష్మికి సైతం పార్టీలో సరైన గౌరవం దక్కలేదన్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం తాను దరఖాస్తు పెట్టుకుంటే తన పేరును ఢిల్లీకి పంపకుండా కుట్ర చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం మొత్తం తిరిగి చింతల రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామన్నారు. చింతల వైఖరి కారణంగానే తాము పార్టీ మారుతున్నామని కార్పొరేటర్ మహాలక్ష్మి తెలిపారు. అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్​కు చేరుకున్న మహాలక్ష్మి, రామన్ గౌడ్ దంపతులను మంత్రి కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.