
ఇప్పటికే పనిగంటల విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు తమ పౌరులకు వారానికి పనిగంటలను అలాగే పని రోజులను కూడా తగ్గిస్తూ పోతూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తుంటే మరోపక్క భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పని గంటల పెంపులకు అక్కడి ప్రభుత్వాలు ఆమోదం తెలపటం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల రోజువారీ పని గంటలను ప్రస్తుతం ఉన్న 9 గంటల నుంచి 10 గంటల వరకు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రతిపాదన మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం, 2017లో మార్పులు చేసేందుకు ఓ ప్రణాళికగా ఉంది. అయితే ఈ మార్పులకు ముందుగా క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉండగా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు నెలల వ్యవధిలో 125 గంటలుగా ఉన్న ఓవరటైమ్ పరిమితిని 144 గంటల వరకు పెంచే ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత చట్ట ప్రకారం 10 మందితో మొదలయ్యే సంస్థలకు నిబంధనలు వర్తిస్తుండగా.. కొత్త ప్రపోజల్ ప్రకారం 20 మంది పనిచేస్తున్న సంస్థలకు కూడా పనిగంటల పెంపు వర్తించేలా ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఉద్యోగుల సేఫ్టీ, ఉత్పాదకత కోసం పని గంటల సమయంలో బ్రేక్‌లు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకు కూడా నైట్ షిఫ్టులకు అనుమతులు ఇవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది.
కొత్త రూల్స్ తీసుకురావటం ద్వారా అంతర్జాతీయంగా పాటిస్తున్న ప్రమాణాలను దేశంలోని పాత నియంత్రణలకు మధ్య వ్యత్యాసాన్ని తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఉద్యోగుల పనితీరు మెరుగుదలకి, వ్యాపారాల్లో సౌలభ్యాలను కల్పించటం లక్ష్యంగా ఉంది. అయితే ఇప్పటికీ ఈ ప్రతిపాదనపై ముఖ్యమైన వివరాలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడైంది.
మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనిగంటల పెంపుపై కొన్ని కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. ఈ నిర్ణయం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వారు అంటున్నారు. అనవసరంగా ఎక్కువ గంటలు పని చేయవలసి రావడం, అధిక ఒత్తిడితి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.