అన్ని పార్టీలనూ కలవరపెడుతున్న .. మహారాష్ట్ర ఎన్నికలు

అన్ని పార్టీలనూ కలవరపెడుతున్న .. మహారాష్ట్ర ఎన్నికలు

 గొప్ప రచయిత షేక్​స్పియర్​ 500 సంవత్సరాల క్రితం   ‘Uneasy lies the head which wears the crown’  అని రాశాడు. ఇది విలియం షేక్​స్పియర్​ రచించిన కింగ్ హెన్రీ ది ఫోర్త్, పార్ట్ టూ నాటకంలోని ఒక లైన్. వాస్తవానికి, షేక్​స్పియర్ దీనిని ఇంగ్లీష్​ కింగ్​ గురించి రాశాడు. కిరీటం ధరించిన రాజు వంటి గొప్ప బాధ్యతలను కలిగి ఉన్న వ్యక్తి నిరంతరం ఆలోచనలతో సతమతం అవుతుంటాడు. అందువల్ల అతడికి సరిగా నిద్ర కూడా పట్టదు. ఎక్కువగా అసహనంగా ఉంటాడు. కింగ్ నిరంతరం శత్రువుల నుంచి ప్రాణాంతక బెదిరింపులను ఎదుర్కొన్న నేపథ్యంలో షేక్​స్పియర్​ ఆ లైన్​ రాశాడు. 

 ఇక, భారతదేశంలో నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయినప్పటికీ, నవంబర్ 2024లో జరిగే రాష్ట్రాల ఎన్నికల రూపంలో ఆయన పెద్ద సవాలును ఎదుర్కోనున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితోపాటు, ప్రతిపక్ష ఇండియా కూటమికి కూడా మహారాష్ట్ర  ఓ పెద్ద సవాలుగా మారనుంది. హర్యానా, జార్ఖండ్‌‌లలో కూడా ఎన్నికలు జరగనున్నా రెండు కూటములకు మహారాష్ట్రనే కీలకం. 

ప్రస్తుతం మహారాష్ట్రలో  బీజేపీ కూటమి ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. 2024 పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్​సభ స్థానాల్లో బీజేపీ కూటమి 17 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2019లో బీజేపీ కూటమి 48 ఎంపీ స్థానాలకుగాను 41 మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ, ఈసారి కేవలం17మంది ఎంపీలతో బీజేపీ కూటమి పేలవ ప్రదర్శన ప్రధాని నరేంద్ర మోదీ టెన్షన్‌‌‌‌కు ప్రధాన కారణం. 

మహారాష్ట్రలో కీలక నాయకులు                  
                                                           
మహారాష్ట్రలో చాలామంది కీలక రాజకీయ నాయకులు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌‌లో ప్రభావవంతమైన నేతలు ఉన్నారు. అదేవిధంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కూడా మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. వీరితోపాటు శరద్ పవార్ నుంచి విడిపోయిన అజిత్ పవార్,  ఠాక్రే కుటుంబాన్ని వీడిన  ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే ఉన్నారు. వీరి పార్టీలకు తోడుగా అనేక చిన్న పార్టీలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష  కూటమి మహారాష్ట్రలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.  ఒకవేళ ఓడిపోతే శరద్‌‌పవార్‌‌, ఉద్ధవ్‌‌ ఠాక్రే కుటుంబ పార్టీలకు కష్టాలు తప్పవు. ఇండియా కూటమి మహారాష్ట్రలో ఓటమిపాలైతే కాంగ్రెస్‌‌ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగులుతుంది.

ఇండియా కూటమి గెలిస్తే మోదీకి పెద్ద దెబ్బే

2019లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే, ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షమైన శివసేన బీజేపీ కూటమిని వీడి కాంగ్రెస్, శరద్ పవార్‌‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం జూన్ 2022లో పడిపోయింది.  శివసేన, శరద్ పవార్ పార్టీలు రెండు ముక్కలయ్యాయి. చీలిపోయిన షిండే సారథ్యంలో శివసేన,  అజిత్​ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఈనేపథ్యంలో ఒకవేళ ఇండియా కూటమి మహారాష్ట్రలో విజయం సాధిస్తే, అది ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అంటే భారతదేశంలో రెండవ అతిపెద్ద, ధనిక రాష్ట్రం మహారాష్ట్ర బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంది.

ఊహించని ఫలితాలు

బీజేపీ అత్యాశకు పోయి మహారాష్ట్రలోని మొత్తం 48 మంది ఎంపీ స్థానాలకు గాను 28 స్థానాలకు పోటీ చేసింది. కానీ, బీజేపీ కేవలం 9 మంది ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. మరోవైపు ఏకనాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ మిత్రపక్షమైన శివసేన 15 స్థానాల్లో పోటీ చేసి 7 స్థానాలను గెలుచుకుంది. వాస్తవానికి బీజేపీ కంటే శివసేన మెరుగైన ఫలితాలు సాధించింది. ఎందుకంటే శివసేన ఓటర్లు ఏకనాథ్ షిండేకు గట్టి మద్దతు ఇచ్చారు. బీజేపీ ఏకనాథ్ షిండే శివసేనకు ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీచేసేలా సీట్లు ఇచ్చి ఉంటే మహారాష్ట్రలో ఫలితాలు మరోలా ఉండేవి.

మహారాష్ట్రలో ఇండియా కూటమికి సమస్యలు   

మహారాష్ట్రలో ఇండియా కూటమికి పార్లమెంటు ఎన్నికల్లో విజయం వారికి అతి విశ్వాసాన్ని కలిగించింది. ఇండియా కూటమిలోని ప్రతి భాగస్వామ్య పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కోరుకునే అవకాశం ఉంది. అంతేగాక సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో నిరాశ, తిరుగుబాట్లు ఉంటాయి. మరోవైపు బీజేపీ హైకమాండ్​ తన తప్పులను తెలుసుకుంది. వాటిని సరిదిద్దుకోవడానికి, గెలుపు బాట పట్టడానికి కావాల్సిన సమయం ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మధ్య వైరుధ్య లక్ష్యాలు కూడా ఉన్నాయి. శివసేన చీలిపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే బలహీనపడ్డారని కాంగ్రెస్ భావిస్తోంది. 1999–-2015 మధ్య వరుసగా 15 ఏండ్ల పాటు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటోంది.

బీజేపీ వ్యూహం 

మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీ అత్యంత బలోపేతం అవుతుంది. మోదీ  ప్రభుత్వం బలపడుతుంది. అయితే, మిత్రపక్షాలకు, కొత్త భాగస్వామ్య పక్షాలకు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బీజేపీ పెద్ద త్యాగాలు చేయాల్సి వస్తోంది. బీజేపీకి ఉన్న అతిపెద్ద అనుకూల అంశం నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం. ఇది మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి ఇతోధికంగా సహాయపడుతుంది. మహారాష్ట్ర చరిత్రను పరిశీలిస్తే ఆ రాష్ట్రం చాలా స్వతంత్ర ప్రాంతంగా ఉంది. మొఘలులను అడ్డుకున్న శివాజీ వంటి గొప్ప పాలకులను మహారాష్ట్రులు తయారు చేశారు.  మరాఠా తిరుగుబాటుదారులను ఓడించడానికి ఔరంగజేబు దశాబ్దాలపాటు మహారాష్ట్రలో గడిపాడు. చివరకు విజయం సాధించకుండానే మరణించాడు. మరాఠాలు ఓడిపోవడానికి ముందు బ్రిటిష్ వారితో చాలా కాలం పోరాడారు. ఒకప్పుడు, మరాఠాలు హైదరాబాద్ సమీపంలోని ప్రాంతాల నుంచి నేటి పాకిస్థాన్‌‌లోని లాహోర్ వరకు పాలించారు.

పవార్, ఠాక్రే ​ఏం చేయనున్నారు?

శరద్ పవార్ వయసు 84 ఏండ్లు. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేకు రాజకీయ భవిష్యత్తు ఉందని, అయితే ఆమె సొంతంగా పార్టీని విజయవంతంగా నిర్వహించలేదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌‌లో చిన్న పార్టీలు విలీనం కావచ్చని శరద్ పవార్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో బీజేపీని మట్టికరిపించిన ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ ముఖ్యమంత్రి పదవిని పొందడం తప్పనిసరి. లేదంటే ఆయన పార్టీ క్షీణిస్తుంది.  అలాగే, ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవిని నిరాకరిస్తే ఆయన కాంగ్రెస్, శరద్ పవార్ కూటమిని విడిచిపెడతారని మహారాష్ట్రలోని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

అన్ని పార్టీలకూ మహారాష్ట్రనే కీలకం

2024లో మహారాష్ట్ర బీజేపీకి సమస్యాత్మక రాష్ట్రంగా మారనుందని నా ఆర్టికల్స్​లో చాలాసార్లు రాశాను. మహారాష్ట్ర రాజకీయపరంగా అస్తవ్యస్తమైంది. మహారాష్ట్రలో ఇప్పటికీ గందరగోళ స్థితి కొనసాగుతోంది. అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడంతో మహారాష్ట్ర అసెంబ్లీ పోరు రసవత్తరంగా జరగనుంది. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌‌నాథ్ షిండే, తిరుగుబాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ భవితవ్యంతో పాటు కాంగ్రెస్ భవిష్యత్తును మహారాష్ట్ర నిర్ణయిస్తుంది. బీజేపీ మహారాష్ట్రలో గెలవగలిగితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని 2029కి పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసంతో సిద్ధపడుతుంది. ఈక్రమంలో భారత రాజకీయాల్లో మహారాష్ట్ర మళ్లీ కీలక రాష్ట్రంగా మారింది. మరాఠాల విలక్షణమైన పాత్ర పోషిస్తారు. అయితే తమకు లాభం చేకూరితే వారు కూడా ఎప్పుడైనా రాజీబాటపడతారు. మే1999లో సోనియా గాంధీని విమర్శించిన శరద్ పవార్ కాంగ్రెస్‌‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. నాలుగు  నెలల్లోనే శరద్ పవార్ కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో విజయం సాధించారు. 

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్​