నెల రోజుల్లో కోటీశ్వరుడైనా టమాటా రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది

నెల రోజుల్లో కోటీశ్వరుడైనా టమాటా రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది

టమాటా.. టమాటా.. టమాటా.. బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. టమాటా పంటను కాపాడుకోవటం కోసం ప్రత్యేక సిబ్బందిని పెట్టుకుంటున్నారు రైతులు. పొలాల్లో రాత్రీ పగలు కాపలాకాస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమామా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి 250 రూపాయల వరకు పలుకుతుంది. రాబోయే రోజుల్లో 300 రూపాయల వరకు పలకొచ్చని అంచనా.. ఈ క్రమంలోనే ఈ ఏడాది టమాటా రైతులు బాగా లాభపడ్డారు.. ఇన్నాళ్లు కనీస ధర లేక రోడ్లపై పారబోసిన టమామా.. ఇప్పుడు సిరులు కురిపిస్తుంది. రాత్రికి రాత్రి కోటేశ్వరులను చేస్తుంది టమాటా..

మహారాష్ట్ర పూణె జిల్లాకు చెందిన తుకారం భగోజీ కుటుంబం 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూనే ఉంది. ఆయా సీజన్ల ఆధారంగా పంటలు పండిస్తుంది. ఐదేళ్లుగా టమాటా పంట పండిస్తుంది. ఎప్పుడూ నష్టాలే.. ఈ ఏడాది మాత్రం 12 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు తుకారం. నెల రోజులుగా పంట చేతికి వస్తూ ఉంది. 12 ఎకరాల్లో 13 వేల బాక్సుల టమాటా దిగుబడి వచ్చింది. ఒక్కో బాక్సులో 20 కిలోల టమాటా ఉంటుంది. 

మొత్తం 13 వేల డబ్బాల టమాటాను విడతల వారీగా విక్రయించింది తుకారం ఫ్యామిలీ. తుకారం కోడలు సోనాలి ఆధ్వర్యంలో నారాయణగంజ్ మార్కెట్ లో వీటిని అమ్మారు. టమాటా నాణ్యత ఆధారంగా కిలో 80 నుంచి 125 రూపాయల వరకు మార్కెట్లో  అమ్ముడుపోయింది పంట. జులై 14వ తేదీ ఒకే రోజు 900 బాక్సులను అమ్మగా.. 18 లక్షల రూపాయలు వచ్చింది. అదే విధంగా 2 వేల 500 బాక్సులను 100 రూపాయల చొప్పున విక్రయించింది ఆ కుటుంబం. కిలో 80 రూపాయల చొప్పున 6 వేల డబ్బాలను.. ఇలా నెల రోజుల్లో 13 వేల బాక్సులను అమ్మగా.. కోటి 50 లక్షల రూపాయలు వచ్చాయి. 

20 ఏళ్ల దరిద్రం మొత్తం ఈ ఒక్క ఏడాదితో పోయిందని.. ఐదేళ్లుగా టమాటా పంటనే నమ్ముకున్నామని.. ఎప్పుడూ లాభాలు రాలేదని.. ఈసారి పంట బాగా పండటంతోపాటు.. ధర కూడా ఎక్కువగా ఉండటంతో.. కోటి 50 లక్షల రూపాయలు వచ్చిందని చెబుతోంది తుకారం కుటుంబం. ప్రస్తుతం పొలంలో ఇంకా కొంచెం పంట ఉందని.. ధర ఇదే విధంగా ఉంటే.. రాబోయే 15 రోజుల్లో మరో 50 లక్షల రూపాయల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నామని చెబుతున్నారు.