ఉల్లిని పొలంలోనే తగలబెట్టి.. సీఎంకు లేఖ రాసిన రైతు

ఉల్లిని పొలంలోనే తగలబెట్టి.. సీఎంకు లేఖ రాసిన రైతు

మహా రాష్ట్రలో ఉల్లి రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉల్లి ధర  కిలో  రెండు రూపాయలకు పడిపోవడంతో  రైతులు ఆవేదనకు గురవుతున్నారు.  ఉల్లి ధరలు  తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో  ధర్నాకు దిగుతున్నారు.   ఓ వైపు ఉల్లి ధరలు తగ్గుతుంటే ఆదుకోవాల్సిన  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి రైతులు ఆందోళనలను తీవ్ర చేశారు.  నాసిక్ జిల్లాలోని ఓ రైతు  ప్రభుత్వ విధివిధానాలకు వ్యతిరేకంగా  తాను పండించిన ఉల్లి పంటను పొలంలోనే తగల బెట్టి సీఎంకు లేఖ రాశాడు. ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యోలా సమీపంలోని మథుల్తాన్ గ్రామానికి చెందిన కృష్ణ డొంగ్రే అనే రైతు ఒకటిన్నర ఎకరాలో  సాగు చేసిన ఉల్లి పంటను కాల్చివేశాడు.  ఉల్లికి కనీస మద్దతు ధర కూడా లేదు. దీనిని మార్కెట్ కు తీసుకెళ్తే  అదనపు ఖర్చులు. మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మలేక తన పొలంలోనే ఉల్లిపంటను తగలబెట్టాడు.  అయితే  ఈ దహన  కార్యక్రమానికి రావాలంటూ ఆ రాష్ట్ర సీఎం షిండేకు లేఖ రాశాడు.  ఇది ఇపుడు వైరల్ అవుతోంది.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు   రైతులను  పట్టించుకోవడం లేదని లేఖలో విమర్శించారు. ఈ ఘటన మహారాష్ట్రకే కాకుండా  దేశానికే బ్లాక్ డేగా వర్ణించాడు.   కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను ప్రశ్నించారు. ఉల్లి ఎగుమతులు పెంచామని కేంద్రం చెబుతున్నా ఉల్లి పంటకు ఎందుకు మంచి ధర రావడం లేదని  రైతులు  ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల  రాత్రింబవళ్లు  కష్టపడి సాగు చేసిన ఉల్లి పంటను తగల బెట్టాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నాడు.  కొన్ని రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఓ  రైతు 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు పోను ఆ రైతుకు రూ.2  మిగిలిన సంగతి తెలిసిందే.