
మహారాష్ట్రలో 50 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. థానే నగరంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా...ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేయడంతో ..ప్రయాణికులంతా దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
థానే మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్ (టిఎమ్‌టి) బస్సు 50 మంది ప్రయాణికులతో నార్పోలి నుంచి కొలివాడక వెళ్తోంది. అయితే సెంట్రల్ మైదాన్ సమీపంలోని రాగానే..జులై 30వ తేదీ ఉదయం 8.30 గంటలకు బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
అనంతరం బస్సు డ్రైవర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది..మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నదని తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.