రైలు పట్టాలపై బండరాళ్లు .. తప్పిన పెను ప్రమాదం

రైలు పట్టాలపై బండరాళ్లు .. తప్పిన పెను ప్రమాదం

రైలు పట్టాలపై ఉన్న బండరాళ్లను రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. అక్టోబర్ 6న పూణె నగరానికి సమీపంలోని అకుర్ది - చించ్వాడ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై బండరాళ్లు కనిపించాయి. దుండగులు రాళ్లను ట్రాక్‌లపై ఉంచారని, అయితే అవి సమయానికి గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత, లైన్‌లో వస్తున్న ముంబైకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగంతకులను గుర్తించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) దర్యాప్తు చేస్తున్నారు.

అధికారులు అందించిన సమాచారం ప్రకారం, పూణే వెళ్లే సబర్బన్ రైలు ట్రాక్ పై బండరాళ్లను గుర్తించిన గార్డు.. వెంటనే అప్రమత్తమై చించ్వాడ్ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే, చించ్వాడ్ స్టేషన్ మాస్టర్ ట్రాక్స్‌పై వస్తున్న 16352 UP నాగర్‌కోయిల్-ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ (డ్రైవర్)ని అప్రమత్తం చేశారు. పట్టాలపై నుంచి బండరాళ్లను తొలగించే వరకు రైలును నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

"లోనావాలా-పుణె సబర్బన్ రైలులో గార్డ్ సందీప్ భలేరావ్ ప్రక్కనే ఉన్న యూపీ ట్రాక్‌లపై బండరాళ్లను గుర్తించి, చించ్వాడ్ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. స్టేషన్ మాస్టర్ వెంటనే యూపీ నాగర్‌కోయిల్-ముంబై CSMT ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్‌ను సంప్రదించారు. బండరాళ్లను తొలగించే సమయం వరకు రైలు నిలిచిపోయింది’’ అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ చర్యను రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు.