ఇంజినీర్ను కొట్టిన మహిళా ఎమ్మెల్యే... గల్లాపట్టి.. చెంప చెళ్లుమనిపించింది

ఇంజినీర్ను కొట్టిన మహిళా ఎమ్మెల్యే... గల్లాపట్టి.. చెంప చెళ్లుమనిపించింది

మహిళా ఎమ్మెల్యే ప్రభుత్వాధికారిపై చేయి చేసుకున్నారు. అందరి ముందే గల్లా పట్టి చెంప చెళ్లుమనింపించారు. ఈ ఘటన మహారాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వాధికారిని ఎమ్మెల్యే కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 

మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగానే కాషిమిరాలోని పెంకర్ పెడా ప్రాంతంలో గల అక్రమ నిర్మాణాలను ఇంజినీర్ లు శుభమ్ పాటిల్, సోనీ ఆధ్వర్యంలో కూల్చివేశారు. అయితే వర్షం కురుస్తున్న సమయంలో కూల్చివేతలు చేపట్టడంతో ఆరు నెలల చిన్నారి సహా వృద్ధులు వర్షంలోనే గడపాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్  కాషిమిరాలోని పెంకర్ పెడాకు చేరుకున్నారు. కూల్చివేతతో తన నియోజకవర్గ ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆమె  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంజినీర్లతో వాగ్వాదానికి దిగారు. వర్షంలో  నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ నిలదీశారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్‌పై చేయిచేసుకున్నారు.  కాలర్ పట్టుకుని చెంప వాయించారు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం..

ఎమ్మెల్యే గీతా జైన్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల కూల్చివేతలో తప్పేముందటూ ప్రశ్నిస్తున్నారు. ఇంజినీర్ ను కొట్టిన  ఎమ్మెల్యే గీతా జైన్పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే వివరణ..

ఈ ఘటనపై ఎమ్మెల్యే గీతా జైన్ వివరణ ఇచ్చారు. పెంకర్పెడా ప్రాంతంలో వర్షాకాలానికి ముదు ప్రజలు నివసించే కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ఇంజినీర్లను అడిగినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో కూల్చివేయడంతో మహిళ తన పిల్లలతో రోడ్డున పడిందన్నారు.  ఆమె బాధను చూసి ఇంజినీర్లపై కోప్పడ్డానన్నారు. కానీ ఇంజినీర్లు మాత్రం నవ్వారని.. ఒక మహిళ బాధను చూసి వారు నవ్వడాన్ని  సహించలేకనే ఇంజినీర్ పై చేయిచేసుకున్నానని ఎమ్మెల్యే గీతా జైన్ తెలిపారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం పడటం లేదన్నారు. దీనిపై ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే గీతా జైన్ స్పష్టం చేశారు.

బీజేపీలో గీతా జైన్ మేయర్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ – శివసేన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.