
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 72 మంది మరణించారు.
భారత వాతావరణ శాఖ జూలై 21న థానే, రాయ్‌గఢ్, పూణే, పాల్ఘర్‌లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబై, రత్నగిరికి కూడా అధికారులు ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించారు. ఈ తరుణంలోనే కొల్హాపూర్ జిల్లాకు కూడా రాబోయే 5 రోజుల పాటు IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
థానే, పాల్ఘర్, రాయ్‌ఘడ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీలలో కుండపోత వర్షాలను ఎదుర్కోవడానికి NDRF బృందాలు ఇప్పటికే మోహరించగా.. అంతకుముందు జూలై 19న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి కుగ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖలాపూర్ తహసీల్ పరిధిలోని కొండ వాలుపై ఉన్న గిరిజన గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 86 మంది గ్రామస్తుల జాడ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.