ఘోర ప్రమాదం...గిర్డర్ కూలి 15 మంది మృతి

ఘోర ప్రమాదం...గిర్డర్ కూలి 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగస్టు 01వ తేదీ మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని షాపూర్ సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్ కూలిపోవడంతో 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేజ్‌-3 నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్‌పై గిడ్డర్‌ యంత్రం  అమరుస్తుండగా ఈ ఘటన జరిగింది.  ఘటనా స్థలంలో మరో ఆరుగురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.  ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ పరిశీలించారు.

సమృద్ధి మహామార్గ్‌ ను నాగ్‌పూర్‌-ముంబై మధ్య నిర్మిస్తున్నారు. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో రెండు దశలు పూర్తయ్యాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్‌ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది.