థాక్రే​కు తొలి ‘పరీక్ష’.. ఫ్లోర్ టెస్ట్ ఇవ్వాళే

థాక్రే​కు తొలి ‘పరీక్ష’..   ఫ్లోర్ టెస్ట్ ఇవ్వాళే
  • 160 మందికిపైగా ఎమ్మెల్యేల బలం
  • కూటమి ఈజీగా గట్టెక్కే అవకాశం
  • మెట్రో కోసం ఒక్క కొమ్మ కూడా నరకడానికి వీల్లేదని స్పష్టం

ముంబై: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ ఆగాధీ’ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురుకానుంది. శనివారం ఈ మేరకు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్​ను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు విధాన్​భవన్ అధికార వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్​3వ తేదీలోపు మెజారిటీ నిరూపించుకోవాలని మహారాష్ర్ట సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేను గవర్నర్ భగత్​సింగ్ కోష్యారీ కోరారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ శనివారం బల పరీక్షను ఎదుర్కోనున్నట్లు తెలిసింది. ఫ్లోర్​టెస్టులో థాక్రే సర్కార్ ఈజీగా గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. కూటమికి 160 మందికిపైగా సభ్యుల బలం ఉంది. ఈ మధ్యే ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్​లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​కు చెందిన మొత్తం 162 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించారు.

బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్

మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మంత్రాలయ(సెక్రెటేరియట్)లోని ఆరో ఫ్లోర్​లో ఉన్న కార్యాలయంలో చార్జ్ తీసుకున్నారు. ఆయన ఆఫీసులో ‘ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే’ నేమ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. బాధ్యతలు తీసుకోవడానికి ముందు.. మంత్రాలయలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ‘హుతాత్మ చౌక్’లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.

‘ఆగాధీ’పై పిటిషన్ కొట్టివేత

మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పొలిటికల్ మొరాలిటీతో పోలిస్తే.. కాన్​స్టిట్యూషన్ మొరాలిటీ విభిన్నమైనదని న్యాయమూర్తులు జస్టిస్​ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ కామెంట్ చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ.. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే హక్కులను తాము అదుపు చేయలేమని పేర్కొంది. ‘‘ఎన్నికల తర్వాత ఏర్పడిన పొత్తుల విషయంలో కోర్టు జోక్యం చేసుకుంటుందని ఆశించవద్దు. ఎందుకంటే ఆ విషయంలో కోర్టుకు అధికారం లేదు. దీనిపై నిర్ణయం తీసుకునేది ప్రజలు మాత్రమే. కోర్టులు కాదు’’ అని స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. దానిపై కోర్టులు ఆదేశాలివ్వవని వివరించింది. అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ప్రమోద్ పండిత్ జోషి ఈ పిటిషన్ వేశారు.

మెట్రో కార్​షెడ్ పనులను ఆపండి

ముంబై​లోని గ్రీన్ ప్లేస్ ‘ఆరే కాలనీ’లో చేపట్టిన మెట్రో కార్​షెడ్ పనులను నిలిపేయాలని సీఎం ఉద్ధవ్ ఆదేశించారు. సుమారు 2 వేల పెద్ద పెద్ద చెట్లను నరికేసి మెట్రో కార్​షెడ్ కన్​స్ట్రక్షన్ చేస్తుండటంపై కొన్ని రోజులుగా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఆదేశాలిచ్చారు. అయితే మొత్తంగా మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను తాను ఆపేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆరే కార్​షెడ్ పనులను నిలిపేయాలని ఆదేశించా. అక్కడి మొత్తం పరిస్థితిని రివ్యూ చేస్తా. చెట్లను రాత్రికి రాత్రి నరికేసే సంస్కృతిని నేను అంగీకరించను. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఒక్క కొమ్మ కూడా నరకడానికి వీల్లేదు” అని స్పష్టం చేశారు. ఆరే కాలనీలో చెట్లను నరికేయడంపై గత ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా శివసేన వ్యతిరేకత వ్యక్తం చేసింది.

Maharashtra: Uddhav Thackeray govt to face floor test on Saturday