ఎనిమిదో వింత : కార్పెట్ పై తారు రోడ్డు వేశారు.. జర్మన్ టెక్నాలజీ అంట..

ఎనిమిదో వింత : కార్పెట్ పై తారు రోడ్డు వేశారు.. జర్మన్ టెక్నాలజీ అంట..

రోడ్డు వేయాలంటే ఓ పద్దతి ఉంటుంది.. రహదారిని చదును చేయటం.. ఆ తర్వాత గులక రాళ్లు వేయటం.. రోడ్డు రోలర్ తో దాన్ని చదును చేయటం.. ఆ తర్వాత తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. సహజంగా జరిగే ప్రక్రియ ఇది. ఇందుకు భిన్నంగా.. జర్మన్ టెక్నాలజీ పేరుతో.. మహా రాష్ట్రలో నిర్మించిన రోడ్డు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ రోడ్డు నిర్మాణం ఎలా జరిగింది అంటారా.. 

మహారాష్ట్ర రాష్ట్రం.. జల్నా జిల్లాలోని అంబాద్ మండలంలో కర్జాత్ అనే గ్రామం నుంచి పోఖారీ గ్రామం వరకు కొత్తగా తారు రోడ్డు నిర్మించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన్ పథకం కింద ఈ రహదారి నిర్మాణం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణంలో కార్పెట్లు వినియోగించినట్లు చెబుతున్నారు స్థానికులు. కొత్తగా వేసిన రోడ్డు.. అట్టముక్కలా పైకి రావటం విచిత్రంగా ఉంది. తారు రోడ్డు కింద కార్పెట్ వేసి.. దానిపైన తారు పోసుకుంటూ వెళ్లాడు కాంట్రాక్టర్. దీంతో రోడ్డును చేతులతో తీస్తే.. అట్టముక్కలా వచ్చేస్తుంది. దాని కింద ఓ మందపాటి కార్పెట్ ఉండటం విశేషం. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో సంచలనంగా మారింది. 

ఈ విషయంపై కాంట్రాక్టర్ రాణా ఠాకూర్ స్పందించారు. ఇది జర్మన్ టెక్నాలజీ అని చెబుతున్నాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. ఈ తారు రోడ్డును ఇప్పుడు స్థానికులు కార్పెట్ చుట్టినట్లు చుడుతున్నారు. రోడ్డు వేసి నాలుగు రోజులు అవుతుందని.. ఈ విధంగా లేచిపోతుందని.. ఇలాంటి రోడ్లను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా మండిపడుతున్నారు స్థానికులు.. కొన్నేళ్లుగా రోడ్లు బాగుచేయాలని ఆందోళనలు చేస్తుంటే.. రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ కార్పెట్ తారు రోడ్డు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జర్మన్ టెక్నాలజీ అని వదిలేస్తారా లేక చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి..  ఏమైనా మన కాంట్రాక్టర్లకు వచ్చే ఐడియాలు.. ప్రపంచంలో ఎవరికీ రావే...

 

Is it a road? Is it a carpet? Is it 40% govt? ?
Jalna, Maharashtra.
pic.twitter.com/lr6L5FZvdO

— Cow Momma (@Cow__Momma) May 31, 2023