రాష్ట్రంలోకి మహారాష్ట్ర వైరస్​.. అందుకే ఇంత స్పీడ్​..

రాష్ట్రంలోకి మహారాష్ట్ర వైరస్​.. అందుకే ఇంత స్పీడ్​..
  • అందుకే ఇంత స్పీడ్​గా వ్యాప్తి
  • గుర్తించిన సీసీఎంబీ సైంటిస్టులు
  • మహారాష్ట్రలో 61% కేసులు దీనివల్లే
  • వేరియంట్లు ఎన్ని వచ్చినా మాస్క్​తోనే రక్షణ

హైదరాబాద్, వెలుగు: అత్యంత వేగంగా విస్తరించే లక్షణమున్న కరోనా మహారాష్ట్ర వేరియంట్(బి 1.617)​ వైరస్ మన రాష్ట్రంలోకి ఎంటరైంది. ఈ వేరియంట్​కు స్పీడ్​గా స్ప్రెడ్​ అయ్యే గుణం ఉండటం వల్లే కరోనా కేసులు ఊహకందని విధంగా పెరిగిపోతున్నాయి. ముందు మహారాష్ట్రను చుట్టేసిన ఈ వేరియంట్​ ఇప్పుడు మన రాష్ట్రంలోనూ విజృంభిస్తోంది. సీసీఎంబీ సైంటిస్టులు చేసిన జీనోమ్  సీక్వెన్సింగ్‌‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ రకం వైరస్ స్పైక్ ప్రొటీన్‌‌లో ‘ఈ484క్యూ’, ‘ఎల్‌‌452ఆర్’ అనే రెండు వేరియంట్లను సైంటిస్టులు గుర్తించారు. గతేడాది డిసెంబర్‌‌‌‌లో బి1.617 వేరియంట్‌‌ను మనదేశంలో మొదటిసారి కనుగొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో విస్తరిస్తున్న 61 శాతం కేసులకు ఇదే వేరియంట్ కారణమని పుణె  వైరాలజీ ఇన్​స్టిట్యూట్ సైంటిస్టులు ఇటీవలే ప్రకటించారు. తెలంగాణ, ఏపీ నుంచి తాము సేకరించిన శాంపిల్స్‌లో 2 శాతం బి1.617  వేరియంట్ ఉన్నట్టు సీసీఎంబీ డైరెక్టర్‌  డాక్టర్ రాకేశ్‌మిశ్రా ‘వెలుగు’తో అన్నారు. ఈ శాంపిల్స్ సేకరించి 3 వారాలు అవుతోందని, ఇంకా ఎక్కువ శాంపిల్స్‌ సేకరిస్తే ఎక్కువ కూడా వచ్చే చాన్స్ ఉందని ఆయన చెప్పారు.

ఎందుకంత స్పీడ్?
మనుషుల కణాలకు అతుక్కుపోవడానికి వైరస్‌లకు స్పైక్ ప్రొటీన్లు ఉపయోగపడుతాయి. ఆ తర్వాత మెల్లిగా కణాల లోపలికి ప్రవేశిస్తాయి. బి1.617 వేరియంట్ వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో రెండు రకాల వేరియంట్లు ఉన్నాయి. అంటే, రెండు కలిసి ఒక వేరియంట్‌గా ఏర్పడ్డాయి. అందుకే దీన్ని డబుల్ మ్యుటెంట్ వైరస్‌గా కూడా పిలుస్తున్నారు. స్పైక్ ప్రొటీన్‌ రెండు వేరియంట్లతో స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మనుషులకు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ‘‘గతంలో ఉన్న వేరియంట్‌ సోకిన వాళ్ల ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులు ఐదారు మంది ఉంటే, అందులో ఒకరిద్దరికి మాత్రమే వైరస్ స్ప్రెడ్ అయ్యేది. కానీ, బి1.617  వేరియంట్ ఐదారు మంది కాంటాక్ట్స్‌ ఉంటే, అందరికి స్ర్పెడ్ అవుతోంది’’ అని రాకేశ్‌ మిశ్రా వివరించారు.

సీరియస్ అయితదా?
ఈ రకం వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతున్నట్టు మాత్రమే సైంటిస్టులు కనుగొన్నారు. కానీ, ఇది సోకిన వాళ్లు సీరియస్ అవుతారా? లేదా అనే విషయంపై ఇప్పటివరకూ స్టడీస్ జరగలేదు. ‘‘వైరస్‌ వెంటనే స్ప్రెడ్ అవుతోందని మాత్రమే చెప్పగలుగుతాం. దాని వల్లే సీరియస్ అవుతున్నారని చెప్పలేం’’ అని రాకేశ్‌ మిశ్రా అన్నారు. ప్రతి వైరస్‌లో మ్యుటేషన్లు సహజమేనని ఆయన చెప్పారు. ఇప్పటికే కరోనా కొన్ని వేల మ్యుటేషన్లు జరిగి ఉండొచ్చన్నారు. వేరియంట్ ఏదైనా మాస్క్ పెట్టుకుంటే సోకే చాన్స్ తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. జనాలు మాస్కులు పెట్టుకోకుండా, వేరియంట్ల గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇయ్యాల నో వ్యాక్సినేషన్‌..
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం వ్యాక్సినేషన్‌ను నిలిపేశారు. ఆదివారం 2.7 లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నాయి. సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సిన్​ వేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 28 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.