కాంగ్రెస్​కు చవాన్ గుడ్​బై

కాంగ్రెస్​కు చవాన్ గుడ్​బై
  •  బీజేపీలో చేరే ఆలోచనలో మహారాష్ట్ర మాజీ సీఎం

ముంబై, న్యూఢిల్లీ : లోక్​సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం, సీనియర్ ​నేత అశోక్​చవాన్​ సోమవారం కాంగ్రెస్​ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర పీసీసీ చీఫ్​ నానా పటోలేకు లేఖ రాశాడు. అలాగే అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్​ను కలిసి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చవాన్ ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

‘‘మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా.. ఇంకా ఏ పార్టీతోనూ మాట్లాడలేదు” అని అన్నారు. లోక్​సభ, అసెంబ్లీ సీట్ల పంపకంలో పీసీసీ  చీఫ్​తో చవాన్​కు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే చవాన్ బీజేపీలో చేరుతున్నారని.. ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వార్తలను బలపరిచేలా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్​ కామెంట్లు ఉన్నాయి. చవాన్ రాజీనామాపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా ‘‘ముందుముందు ఏం జరుగుతుందో చూండండి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

ద్రోహులు పోతే కొత్త వాళ్లు ఎదుగుతారు: కాంగ్రెస్​

చవాన్ రాజీనామా సందర్భంగా “ద్రోహులు” అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ద్రోహుల నిష్క్రమణతో ఎప్పటి నుంచో ఎదగాలని ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్​సెక్రటరీ జైరాం రమేశ్​‘ఎక్స్’​​లో పోస్ట్ చేశారు. ‘‘స్నేహితులు, సహచరులు.. తమకు ఎంతో ఇచ్చిన రాజకీయ పార్టీని విడిచిపెడితే అది మనకు చాలా వేదన కలిగిస్తుంది” అని చవాన్ పేరును ప్రస్తావించకుండా ఆయన పేర్కొన్నారు. 

‘‘ కొందరు దుర్బలులకు ఆ వాషింగ్ మెషీన్.. సైద్ధాంతిక నిబద్ధత, వ్యక్తిగత విధేయత కంటే చాలా అట్రాక్టివ్​గా కనిపిస్తుంది’’అని పోస్ట్ చేశారు. దర్యాప్తు సంస్థల నుంచి కేసులు ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరగానే వారిపై ఎంక్వైరీలు ఆగిపోతున్నాయని.. బీజేపీ ‘వాషింగ్​మెషీన్’ లాగా వారిపై మరకలను క్లీన్​ చేస్తున్నదని కొన్ని రోజులుగా కాంగ్రెస్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఏజెన్సీల ఒత్తిడి.. ప్రలోభాలు: శ్రీనతే

చవాన్ పార్టీని వీడడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే ను మీడియా ప్రశ్నించగా.. ప్రతిపక్షంలో ఉంటూ రాజకీయాల్లో కొనసాగడం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారిందని తెలిపారు. ‘‘ప్రభుత్వం కళ్లలోకి చూస్తూ వారు ప్రవేశపెట్టిన వైట్​పేపర్​ను ఫేక్ డాక్యుమెంట్ తప్ప మరోటి కాదు అని చెప్పడానికి ధైర్యం కావాలి. కొందరిపై దర్యాప్తు సంస్థల ఒత్తిడి ఉంది. ఇంకొందరిని ప్రలోభాలకు గురిచేస్తున్నరు. కొద్ది రోజులుగా పార్టీని వీడిన వారిపైనున్న ఈడీ కేసులను ఎంక్వైరీని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది” అని ఆమె అన్నారు.

 పోరాడే ధైర్యవంతులైన నాయకులే ప్రతిపక్షంలో ఉంటూ రాజకీయాలు చేయగలరని.. ‘సత్యం(ట్రూత్)’ వెంట నిలిచి రాహుల్ ఆ పని చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నుంచి వైదొలగడంపై అశోక్​చవాన్ చేసిన పోస్ట్‌‌కు కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ షోలే సినిమాలోని ‘‘జో డర్ గయా సంజో మర్ గయా’’ అనే ఫేమస్ డైలాగ్ వీడియో క్లిప్​ను ట్యాగ్ చేస్తూ షేర్ చేశారు. 

కాగా, మరఠ్వాడాలోని నాందేడ్ జిల్లాకు చెందిన అశోక్ చవాన్​కు ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉంది. ఆయన తండ్రి, దివంగత శంకర్‌‌రావు చవాన్ కూడా మహారాష్ట్రకు రెండు సార్లు సీఎంగా పనిచేశారు. 2010లో ముంబైలోని ఆదర్శ్ హౌసింగ్ సోసైటీ స్కాంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అశోక్ చవాన్ సీఎం పదవికి రాజీనామా చేశారు.