
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని కాన్ఫిడెంట్‌గాచెబుతున్నారు మహేష్ బాబు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకులముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి మహేష్ బాబు ఇలా ముచ్చటించారు.
- ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే. ‘గీతగోవిందం’ అనేది ఎక్స్ ట్రార్డినరీ మూవీ. ఆ సినిమా తర్వాత పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. హీరో క్యారెక్టరైజేషన్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశాడు. పరశురామ్‌లో నాకు బాగా నచ్చింది తన రైటింగ్ స్టైల్.
- కథ ఫస్టాఫ్ యూఎస్‌లో మొదలై సెకెండాఫ్‌కి వైజాగ్‌కి షిప్ట్ అవుతుంది. నా క్యారెక్టర్‌కు ఎలాంటి బౌండరీస్ ఉండవు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. నా డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. ‘పోకిరి’ తరహా మాస్ పర్‌ఫార్మెన్స్ మళ్లీ ఇందులో కుదిరింది. అలాంటి షేడ్స్ ఉన్న పాత్ర మళ్లీ దొరికినందుకు హ్యాపీ.
- మొదటి నుంచి నమ్మిన స్క్రిప్ట్‌నే సినిమాగా చేశాం తప్ప ప్యాండమిక్‌లో టైమ్ దొరికింది కదా అని ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ‘మమ మాస్’ సాంగ్ మాత్రం అదనంగా చేరింది. నిజానికి ‘మురారి’ అనే మరో సాంగ్‌ని షూట్ చేశాం. కానీ సినిమా ఫ్లోను బట్టి మాస్ సాంగ్ బాగుంటుందని అప్పటికప్పుడు ‘మమ.. మహేషా’ పాటను కంపోజ్ చేసి షూట్ చేశాం. ఇప్పుడది సినిమాలోని మెయిన్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది.
- కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. టెర్రిఫిక్‌గా చేసిందామె. మా ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియెన్స్ ఉంటారు. తమన్ తన సంగీతంతో ప్రాణం పెట్టాడు. ‘కళావతి’ పాట ట్యూన్ మొదట మా అందరికీ నచ్చలేదు. తమన్ మాత్రం నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అవుతుందని నమ్మాడు. ఇప్పుడదే నిజమైంది. నా ఫేవరేట్ సాంగ్ కూడా అదే.
- మన సినిమాలే ఇతర భాషల్లోకి రీచ్ అవ్వాలి. మన ఇండస్ట్రీని వదిలేసి వేరే ఇండస్ట్రీకి మనమెందుకు వెళ్లాలనేది నా ఫీలింగ్. అందుకే తెలుగు సినిమాలే చేస్తాను. గత పదేళ్లుగా నేను నమ్మిందే ఇప్పుడు నిజమై, మన సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. ఆ విషయంలో హ్యాపీ.
- త్రివిక్రమ్ గారి సినిమా కోసం ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఆయన డైలాగ్స్‌కి పెర్‌ఫార్మ్ చేయడం నాకు అతి పెద్ద కిక్‌ని ఇస్తుంది. మా గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా కొత్తగా ఉంటుంది. ఇక రాజమౌళి గారితో సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఆయనతో ఒక్క సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసినట్టే.
- ప్రస్తుత జనరేషన్ పిల్లలు తమ జీవితాల గురించి తామే నిర్ణయాలు తీసుకుంటున్నారు. గౌతమ్ అబ్రాడ్ వెళ్లి చదువుకుంటాను అంటున్నాడు. సితార ఇప్పుడే యాక్ట్ చేసేస్తానంటోంది. వాళ్లిద్దరూ యాక్టర్స్ అవడమనే నిర్ణయాన్ని పూర్తిగా వాళ్లకే వదిలేశాం. ఇక నాన్నగారు నాకు దేవుడితో సమానం. ఆయన బయోపిక్‌లో నేను నటించలేను.